అధిక వడ్డీ ఇస్తామంటే ముక్కు మొహం తెలియనివారికి కూడా డబ్బులు ఇచ్చే జనం చాలామంది ఉంటారు. అధిక వడ్డీ, బై బ్యాక్ పాలసీ, తక్కువ పెట్టుబడికి రెట్టింపు లాభం వంటి స్కామ్స్ కి బలైనవారి గురించి తరచూ వింటూనే ఉంటాం. పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి మోసం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి పట్టణంలో చిట్టీల పేరిట పలువురి నుండి రూ. 3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఠాకూర్ హనుమాన్ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ఠాకూర్ హనుమాన్ ప్రసాద్ కి డబ్బులు ఇచ్చి మోసపోయామంటూ గతేడాది డిసెంబర్ లో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అప్పటి నుంచి దొరకకుండా తిరుగుతున్న హనుమాన్ ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.హనుమాన్ ప్రసాద్ తన స్నేహితులు, ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ డాక్టర్లు , పరిచయమున్న వారి నుంచి చిట్టిల పేరిట దాదాపు రూ.3 కోట్లకు పైగానే వసూలు చేసినట్టు పిర్యాదు చేశారు బాధితులు.
అంతే కాకుండా.. 46మంది కి ఐపీ నోటీసులు కూడా పంపినట్టు తెలిపారు బాధితులు.పట్టణంలో తన పేరిట ఉన్న ఇంటిపై బ్యాంకు రుణం పొందిన హనుమాన్ ప్రసాద్...బ్యాంకు అధికారులను సైతం బురిడీ కొట్టించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ ఇంటిని తన కొడుకు పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు.
హనుమాన్ ప్రసాద్ దగ్గర చిట్టీలు వేసి, వడ్డీలకు ఇచ్చి మోసపోయిన వారు ముందు కొచ్చి ఫిర్యాదు చేయాలని తెలిపారు పోలీసులు. అనుమతి లేకుండా ప్రైవేట్ చిట్టీలు నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని.. ఇలాంటివారిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
