సూర్యాపేట జిల్లాలో నకిలీ బంగారం అమ్మే ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు సూర్యాపేట రురల్ పోలీసులు. నిందితులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ఇర్రి నరేష్, ఏపీలోని ప్రకాశం జిల్లా పల్నాడుకు చెందిన మేడి ఆదినారాయణ, యోగిరెడ్డి, పిట్ట నాగిరెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి రూ. 12 లక్షల నగదు, 5 నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. నిజామాబాద్ లో మహిళకు నకిలీ బంగారాన్ని అంటగట్టి రూ.5 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లను పోలీసులు పట్టుకొని వారి నుంచి క్యాష్ రికవరీ చేశారు. ఆదివారం నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. గుంటూర్ జిల్లాకు చెందిన తురక శివయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు అంకమ్మ, తన్నీరు గంగారాజు మూడు నకిలీ బంగారం బిస్కెట్లు తయారు చేసి వాటిని అసలువిగా నమ్మించి అమ్మడానికి నిజామాబాద్ నగరానికి నాలుగు నెలల క్రితం వచ్చారు.
శివాజీనగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దగ్గరలో మిల్క్ సెంటర్ నడిపే మోర వనిత నుంచి ప్రతి రోజు ఉదయం పాలు కొనేవారు. ఈ రకంగా ఆమెతో పరిచయం పెంచుకొని కూలీ పనులు చేస్తుండగా బంగారు బిస్కెట్లు దొరికాయని, మార్కెట్లో రూ.30 లక్షలు విలువ చేసే బిస్కెట్‌ను రూ.10 లక్షలకు అమ్ముతామని ఆమెను నమ్మించారు.
నిజమేనని నమ్మిన మోర వనిత రూ.5 లక్షలే ఇవ్వగలనని చెప్పగా సరేనని శనివారం బిస్కెట్ ఆమె చేతికిచ్చి క్యాష్ తీసుకొని వెళ్లిపోయారు. తరువాత బిస్కెట్ టెస్ట్ చేయించిన వనిత అది నకిలీదని తేలడంతో లబోదిబోమంటూ 5వ టౌన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తును వేగవంతం చేశారు. డిచ్పల్లి రైల్వేస్టేషన్లో నిందితులు ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల క్యాష్, మరో రెండు నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగాధర్ ఉన్నారు.
