గోవాలో జల్సాల రారాజులు.. హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు

గోవాలో జల్సాల రారాజులు.. హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు

గోవాలో జల్సాలకు అలవాటు పడి.. హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. 

మత్తు పదార్థాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేరేడ్ మెంట్, కుషాయిగూడ ప్రాంతాలకు చెందిన విజయ్ కుమార్, కృష్ణ వంశీ, సతీష్, తేజ, శ్రవణ్ లు కారును అద్దెకు తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు పోలీసులు. 

మత్తు పదార్థాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని.. ఆ దొంగిలించిన సొమ్ముతో గోవాలో జల్సాలు చేసినట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. దొంగతనం చేసే ఇళ్లకు దూరంగా కారును నిలిపి హ్యాండ్ మిషన్ సహాయంతో  తాళాలు కత్తిరించి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఐదుగురు ముఠాలోని సభ్యుల్లో  ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.