తెలంగాణలో దొంగనోట్ల ప్రింటింగ్.. ఏపీ, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో మార్పిడి

తెలంగాణలో దొంగనోట్ల ప్రింటింగ్.. ఏపీ, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో మార్పిడి

భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ముద్రించి, ముంపు మండలాలు, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, వీఆర్​పురం పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచకు చెందిన పొదిల మురళి, జంగం శ్రీనివాస్​, కటారి సామ్రాజ్యం, భద్రాచలానికి చెందిన గౌడుగోళ్ల కిరణ్​కుమార్, అశ్వారావుపేట మండలం అచ్యుతాపురానికి చెందిన పాకపాటి నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఉప్పల్​కు చెందిన పసుపులేటి ఉమేష్​చంద్ర, పల్నాడు(ఆంధ్రా) జిల్లా మాచర్లకు చెందిన వేముల పుల్లారావు, పొదిలి శ్రీనివాస్, తెలంగాణలోని సత్తుపల్లి గ్రామానికి చెందిన కొనకళ్ల చిట్టిబాబు గ్రూపుగా ఏర్పడి పాల్వంచలోని పొదిల మురళి ఇంటి వద్ద రహస్యంగా దొంగనోట్లు ముద్రిస్తున్నారు.

ముద్రించిన నోట్లను ముంపు మండలాలైన చింతూరు, ఎటపాక, నెల్లిపాక, వీఆర్​పురం, కూనవరం, చత్తీస్​గఢ్​రాష్ట్రంలోని కుంట గ్రామాల్లో మార్చేవారు. రూ.10 వేల అసలు నోట్లకు రూ. లక్ష దొంగనోట్లను చెల్లించేవారు. ప్రధానంగా బంకులు, కిరాణా షాపులు, హోటళ్లలో మార్చేవారు. వారపు సంతలను టార్గెట్ చేసుకుని చెలామణి చేసేవారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి రూ.44.5 లక్షల నకిలీ నోట్లు, రెండు ప్రింటర్లు, ఒక కంప్యూటర్, మానిటర్, లామినేషన్​ మిషన్, రూ.500 నకిలీ నోటు సైజుల్లో కటింగ్​ చేసిన బ్లాక్, కలర్​ బండిల్స్, ఆటో స్వాధీనం చేసుకున్నారు.