సిమ్ కార్డ్ స్కామ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

సిమ్ కార్డ్ స్కామ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను.. లోకల్ కాల్ గా మారుస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఇదాయత్ అలీ, ముజాహద్ అహ్మద్ ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారని.. ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పరికరాల ద్వారా ఇంటర్నెట్ కాల్స్ ను రూట్ చేస్తారని వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా సిమ్లను తీసుకుని వాటి ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను ఇండియన్ కాల్స్ గా మారుస్తారని చెప్పారు. సంతోషనగర్, బాలాపూర్ కేంద్రంగా నిందితులు కాల్ రూటింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, టెలికం అధికారులు కలసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించామని టాస్క్ ఫోర్స్ DCP రేష్మి పెరుమాళ్ తెలిపారు.

కాల్ రూటింగ్ ద్వారా దేశభద్రతకు ముప్పు.. వ్యక్తిగత డేటా కూడా చోరీకి గురి అవుతుందని పేర్కొన్నారు. కాల్ రూటింగ్ అనేది చట్ట విరుద్ధమని.. నిందితులు కాల్ రూటింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్, వందల సిం కార్డులు వాడారని చెప్పారు. వీరి వద్ద నుంచి సిమ్ కార్డ్ లు బాక్స్‌లు, కాల్ రూటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న పరికరాలను సీజ్ చేశామన్నారు.

బాలాపూర్ లో అపార్ట్ మెంట్లో నిందితులో ప్రత్యేకంగా ఒక సెటప్ ఏర్పాటు చేసుకున్నారని.. ఈ సెటప్ తో దుబాయ్, ఖతార్, సౌదీ మొదలైన దేశాల నుంచి వచ్చే కాల్‌లు చట్టవిరుద్ధమైన ILD ఎక్స్‌ఛేంజీలను పాస్ చేస్తారని వివరించారు. ఇటువంటి కాల్‌లను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు గుర్తించలేవని.. ఇలాంటి చర్యల వల్ల జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. అక్రమంగా కాల్ రూటింగ్ చేయడం వల్ల టెలికాం సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని.. కాల్ రూటింగ్ పరికరాలను ఇతర దేశాల నుంచి నిందితులు తెప్పించారని తెలిపారు. 

Also Read :మీ SIM కార్డు పోయిందా..జాగ్రత్త ..హ్యాకర్స్ అటాక్ చేయొచ్చు