నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠా సభ్యుల అరెస్ట్

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠా సభ్యుల అరెస్ట్
  • 260 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

మిర్యాలగూడ, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యాపారుల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  డీఎస్పీ రాజశేఖర్ రాజు కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 25న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో  ఓ వ్యక్తి వస్తూ పోలీసులను చూసి విత్తన బస్తాలను వదిలేసి పారిపోయాడు. 

వాటిని పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి సరిత నకిలీ పత్తి విత్తనాలుగా తేల్చారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆధార్ కార్డు ఆధారంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద గంధ వళ్ల శ్రీరంగాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నకిలీ విత్తన వ్యాపారులు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి కి చెందిన గునుగుంట్ల వీర మణికంఠ అలియాస్ అయ్యప్ప, ముండ్రు మల్లికార్జున్ అలియాస్ అనిల్ చౌదరి, ఎర్రగుంటపల్లి కోటా సాంబశివరావు వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్నట్లు శ్రీరంగా తెలిపాడు. 

పోలీసులు అక్కడిక చేరుకొని 260 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రకాశం జిల్లా పొంగులూరు మండలం చదలవాడకు చెందిన పెండ్యాల జగదీశ్వరరావు నుంచి నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు చెప్పారు. ప్రధాన నిందితుడైన జగదీశ్వరరావు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్ టౌన్ సీఐ సుధాకర్, ఎస్ఐ రవి, పోలీసులు వెంకటేశ్వర్లు, హుస్సేన్, నాగరాజు, నరసింహ, తమిజుద్ధీన్ పాల్గొన్నారు.