
జీడిమెట్ల, వెలుగు: ఫేక్ బ్యాంక్ ను క్రియేట్ చేసి ఇన్వెస్ట్ మెంట్ల భారీ స్కామ్ కు పాల్పడ్డ గ్యాంగ్ కి చెందిన ఇద్దరిని బాలానగర్ ఎస్ వోటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి దగ్గరి నుంచి రూ. కోటి 31 లక్షల క్యాష్, 40 లక్షల విలువైన వెహికల్, 3 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి బుధవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. కర్ణాటకకి చెందిన స్ర్కాప్ వ్యాపారి దవనగిరి సత్యనారాయణ (53), దమ్మాయిగూడకి చెందిన లోన్ఏజెంట్ ప్రియరంజన్ నాయక్ అలియాస్ అజయ్‌పాల్ సింగ్(33), కన్స్ట్రక్షన్ వ్యాపారి కుడికల ప్రేమ్‌కిశోర్(48), విశాల్ సక్పల్, సుశాంత్ ప్రేమ్ దాస్ ఈ ఐదుగురు కలిసి గ్యాంగ్ గా ఏర్పడి ఇన్వెస్ట్ మెంట్ మోసాలకు స్కెచ్ వేశారు. సెకండ్ చానెల్ బ్యాంక్ అంటూ పలువురిని నమ్మించి అకౌంట్లు ఓపెన్ చేయించారు. దీని ద్వారా లావాదేవీలు చేయాలంటే సెండర్, రిసీవర్ ఇద్దరికి అకౌంట్లు ఉండాలని చెప్పారు. ఇదంతా సీక్రెట్ బ్యాంకింగ్ అని, ఇందులో నుంచి మనీ ట్రాన్జాక్షన్లు చేస్తే బ్లాక్ మనీని వైట్ గా మార్చవచ్చని చెప్పేవారు. సెకండ్ చానెల్ బ్యాంక్ దగ్గర రూ. వెయ్యి కోట్లు ఉన్నాయని.. వాటిని క్లయింట్ల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయడానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి.. ఒక్కో స్లాట్ ధర రూ.18 లక్షలని నమ్మించారు. ప్రముఖ బ్యాంక్ కి చెందిన వైస్ ప్రెసిడెంట్ గా నిందితుల్లో ఒకరు క్లయింట్లను నమ్మించేవారు. క్లయింట్లతో ఫైవ్ స్టార్ హోట్ల్స్ లో మీటింగ్ లు ఏర్పాటు చేసి సెకండ్ చానెల్ లో బిజినెస్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన దాని కంటే 3 రెట్లు ఎక్కువ లాభం ఉంటుందని చెప్పేవారు. బాధితుల నుంచి రూ. లక్షలను తమ అకౌంట్లలోకి ఈ గ్యాంగ్ ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ఈ గ్యాంగ్ బారిన పడి మోసపోయిన బాధితుడు సృజన్ ఇచ్చిన కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసిన పేట్ బషీరాబాద్, బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియ రంజన్‌నాయక్ అలియాస్ అజయ్‌పాల్ సింగ్, ప్రేమ్ కిశోర్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సత్యనారాయణ, విశాల్సక్పల్, సుశాంత్ ప్రేమ్ దాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిందని విచారణలో మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు.