ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడనే టార్గెట్​ చేశారట..

ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడనే టార్గెట్​ చేశారట..
  • పోలీస్​స్టేషన్​ ముందు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం
  • ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడనే టార్గెట్​ చేశారని బాధితుడి ఆరోపణ
  • సీఐ హామీతో ఆందోళన విరమణ

అచ్చంపేట, వెలుగు : ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకుంటావా అని బెదిరిస్తూ పోలీసులు తనను చితకబాదారని చేదురుబావి తండాకు చెందిన ఓ వార్డు మెంబర్​ ఆదివారం కుటుంబంతో కలిసి అచ్చపేట పోలీస్​స్టేషన్​ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీకి రాజీనామా చేయాలని బెదిరించారని, లేకపోతే చంపుతామన్నారని వాపోయాడు. బాధితుడి కథనం ప్రకారం..అచ్చంపేట మండలం చేదురుబావితాండాకు చెందిన 8వ వార్డు మెంబర్​ కేతావత్​ మత్రూ నాయక్​ మూడు నెలల కింద నిర్వహించిన ఓ క్రికెట్​టోర్నమెంట్​లో ఎమ్మెల్యే టీమ్​ ఓడిపోతే ఈలలు, కేకలతో సంబురాలు చేసుకున్నాడు.

అప్పుడే ఎమ్మెల్యే అనుచరులు పక్కకు తీసుకెళ్లి చేయి చేసుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారని టార్గెట్ ​చేశారు. హోలీ పండుగ రోజు అచ్చంపేటలో బైక్​పై వెళ్తుండగా ఏఎస్ఐ అంజయ్య, కానిస్టేబుల్​రాంబాబులు పట్టుకుని ‘ ఏం రా ఎక్కువ చేస్తున్నావ్. ఎమ్మెల్యేతోనే గొడవ పెట్టుకుంటవా? కాంగ్రెస్​పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్​లో చేరు. లేదంటే చచ్చిపోతావు’ అని వార్నింగ్​ ఇచ్చారు. పోలీస్ వెహికల్​లో సీట్ల కింద కుక్కి పీఎస్​కు తీసుకువెళ్లి విపరీతంగా కొట్టారు. కాళ్లు మొక్కుతానన్న వదిలి పెట్టలేదు. మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు. కొద్దిసేపటికి వదిలిపెట్టగా మాజీ ఎంపీపీ రామనాథం ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు.

ఆయన పోలీస్​ స్టేషన్​కు వచ్చి ప్రశ్నించగా కానిస్టేబల్​ను తిట్టడంతోనే తీసువచ్చామని ఎస్ఐ సమాధానం ఇచ్చారు. అయితే, తనను అన్యాయంగా కొట్టారని ఆదివారం అచ్చంపేట పోలీస్ స్టేషన్ ముందు మత్రూనాయక్​ కుటుంబంతో సహా ధర్నా కు దిగాడు.  పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ అనుదీప్ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మత్రూనాయక్​కు మద్దతుగా కాంగ్రెస్ ​లీడర్లు నర్సయ్య యాదవ్, రామనాథం, గోపాల్​ రెడ్డి, గౌరీశంకర్​, ఖాదర్​, మహబూబ్​అలీ, అంజనేయులు ఆందోళనలో పాల్గొన్నారు.