మీ బస్తాలు చెక్ చేసుకోండి : హైదరాబాద్ జనం.. బ్రాండెడ్ పేరుతో రేషన్ బియ్యం తింటున్నారా..!

మీ బస్తాలు చెక్ చేసుకోండి : హైదరాబాద్ జనం.. బ్రాండెడ్ పేరుతో రేషన్ బియ్యం తింటున్నారా..!
  • రాజేంద్రనగర్​లో 10 వేల బస్తాలు పట్టివేత
  • సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
  • స్టీమ్డ్​ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టు గుర్తింపు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ జనం అవాక్కయ్యారు. నోరెళ్లబెట్టారు. ఏంటీ.. రేషన్ బియ్యాన్ని తింటున్నామా.. కిలో 70 రూపాయలు పెట్టి కొంటున్నది రేషన్ బియ్యమా.. స్టీమ్ రైస్ పాలిష్ చేసి.. బ్రాండెడ్ పేరుతో అమ్ముతున్నారా.. 500 రూపాయల బస్తా బియ్యాన్ని.. బ్రాండెడ్ పేరుతో 2 వేల రూపాయలకు అమ్ముతున్నారా.. ఈ వార్త చదివిన తర్వాత హైదరాబాద్ సిటీ జనం ఫీలింగ్ ఇదే.. బియ్యాన్ని కూడా నకిలీగా అమ్మటం అంటే.. దరిద్రులు ఏ స్థాయికి దిగజారారు అనే ఫీలింగ్ జనంలో వ్యక్తం అవుతుంది. బ్రాండెడ్ బియ్యం కదా అని.. బస్తాపై పేర్లు చూసి ఇంటికి పట్టుకెళుతున్న బియ్యం.. రేషన్ షాపుల్లోని బియ్యం అని తెలిసి షాక్ అవుతున్నారు. ఏదో వందా.. 200 బస్తాలు కాదండీ.. ఏకంగా హైదరాబాద్ సిటీ శివార్లలో 10 వేల బస్తాలు పట్టుబడటం అంటే.. మామూలు విషయం కాదు కదా.. 

స్టీమ్ రైస్ ను పాలిష్ చేసి వివిధ బ్రాండ్లతో బస్తాల్లో నింపి అమ్ముతున్న గోదాములపై సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన గోదాంను సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లోని మైలార్ దేవుపల్లి టాటానగర్ బస్తీలోని గోదాముల్లో అక్రమంగా బియ్యం నిల్వలు ఉన్నట్టు రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడి వెళ్లి చూడగా మూడు వైపులా పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. అక్కడి సిబ్బంది గేట్లు తెరవకుండా అడ్డుకున్నారు. 

ALSO READ | బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా

సుమారు గంట పాటు అధికారులను లోపలికి రానివ్వ లేదు. దీంతో సివిల్ సప్లయ్స్ అధికారులు లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి గేట్లు తెరిపించగా.. లోపలికెళ్లి సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాల్లేకుండా గోదాంలో పది వేలకు పైగా సోనా మసూరి, బాస్మతి బియ్యం బస్తాలు గుర్తించారు. గోదాం యజమాని వీరేందర్ పలు రాష్ట్రాల నుంచి నార్మల్ సోనామసూరి స్టీమ్ రైస్​ను దిగుమతి చేసుకుని వాటిని పాలిష్ చేస్తున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ఉన్న బ్యాగుల్లో నింపి అమ్ముతున్నట్టు గుర్తించారు.

 వాటి సేల్స్ బిల్స్ కూడా లేవు. బస్తాల్లో నిల్వ ఉన్న బియ్యంలో పీడీఎఫ్ రైస్ గుర్తించేందుకు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్​కు పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మూడు గోదాముల్లో బియ్యం నిల్వలు ఉండగా.. ఒకదాన్ని మాత్రమే అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్పీ శశిధర్, రంగారెడ్డి డీఎస్​వో మనోహర్ కుమార్, ఎన్​ఫోర్స్​మెంట్ డిప్యూటీ ఎమ్మార్వో రఘునందన్, సిబ్బంది పాల్గొన్నారు.