ఇళ్లలో వరుస చోరీలు.. దొంగ ఎలా దొరికాడంటే

ఇళ్లలో వరుస చోరీలు.. దొంగ ఎలా దొరికాడంటే
  •     ఇండ్లల్లో చోరీలు  చేస్తున్న దొంగ అరెస్ట్ 
  •     రూ.28 లక్షల విలువైన బంగారం, వెండి, వెహికల్స్ సీజ్

నేరెడ్ మెట్,వెలుగు: ఇండ్లల్లో చోరీలు చేస్తున్న దొంగను ఫింగర్ ప్రింట్స్​ ఆధారంగా ఎల్ బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నేరెడ్ మెట్​లోని రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో సీపీ మహేశ్ ​భగవత్ వివరాలు వెల్లడించారు.  జగిత్యాల జిల్లాకు చెందిన షేక్ యామిన్ అలియాస్ సలీం(39) షాద్​నగర్​లోని ఎల్లికట్ట గ్రామంలో ఉంటూ లేబర్ పనిచేసేవాడు. ఈజీ మనీ కోసం చోరీలకు స్కెచ్ వేశాడు. 2010లో ఓ చోరీ కేసులో జగిత్యాల పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. బయటికి వచ్చాక మళ్లీ దొంగతనాలు చేయడంతో 2015లో నిజామాబాద్, 2016లో మీర్ పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కి పంపారు.  2018లో అత్యాచారం కేసులో అతడిని  నిర్మల్​ రూరల్​ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.  2019 నవంబర్​లో బయటికి వచ్చిన యామిన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16, సైబరాబాద్​లో 1, జోగుళాంబ గద్వాల్​లో 9, వనపర్తిలో 1, మహబూబ్​నగర్​లో 1, కామారెడ్డిలో1, మెదక్​లో 4, నల్గొండలో 3, నిజామాబాద్​లో 5 ఇలా మొత్తం 41 చోరీలు చేశాడు.  

గత నెల 5న రాత్రి 10 గంటలకు అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలోని  ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన యామిన్ రూ.లక్ష క్యాష్, బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన  పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. రాష్ట్రంలో గతంలో జరిగిన చోరీ కేసుల నిందితుల ఫింగర్​ ప్రింట్స్​తో వాటిని పోల్చి చూశారు. యామిన్ ఫింగర్​ ప్రింట్స్​ మ్యాచ్ కావడంతో శుక్రవారం ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.28 లక్షల 80 వేల విలువైన బంగారు నగలు, వెండి, రూ. లక్షా 50 వేల క్యాష్​, 2 బైక్ లు సీజ్ చేశామని సీపీ మహేశ్​భగవత్ తెలిపారు. యామిమ్​కి చోరీల్లో సహకరించిన మహారాష్ట్రకు చెందిన ఉస్మాన్, నిజామాబాద్ టౌన్ కి చెందిన లక్ష్మణ్ తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు.