వీధుల్లోంచి 800 డెడ్​బాడీస్ తొలగింపు

వీధుల్లోంచి 800 డెడ్​బాడీస్ తొలగింపు

గ్వయక్విల్(ఈక్వెడార్): కరోనా ఎఫెక్టుతో దక్షిన అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో ప్రజలు పడుతున్న తిప్పలు కంటతడి పెట్టిస్తున్నాయి. గ్వయక్విల్ సిటీలో వైరస్ బారిన పడి చనిపోయినవాళ్ల బాడీలను మార్చురీల్లో పెట్టేందుకు చోటు లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో మృతదేహాలను వీధుల్లోనే ఉంచుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెల కప్పుతున్నారు. తమవాళ్ల శవాలను వీధుల్లో ఉంచడం ఇష్టం లేక కొందరు ఇళ్లలోనే భద్రపరుస్తున్నారు. డెడ్​బాడీలను సమాధి చేయడానికి సాయం కోరుతూ చాలా మంది వీడియోలను పోస్టు చేశారు. మార్చురీ వ్యవస్థ పడిపోయిన మూడు వారాల తర్వాత ఈక్వెడార్ ప్రభుత్వం మృతదేహాలను ఖననం చేసే పనిని చేపట్టింది. పోలీసులు, సైనిక సిబ్బంది ప్రజల ఇండ్లలోంచి, వీధుల్లోంచి డెడ్​బాడీలను తొలగిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న గ్వయక్విల్ నుంచే దాదాపు 800 డెడ్​బాడీలను తొలగించామని అధికారులు వెల్లడించారు. కొద్దిరోజులుగా పనిచేస్తున్న టాస్క్ ఫోర్స్ 771 మృతదేహాలను ఇళ్ల నుంచి, మరో 631డెడ్​బాడీలను ఆస్పత్రుల నుంచి వెలికితీసినట్లు అక్కడి సైనిక సిబ్బంది టీమ్ లీడర్ ట్వీట్ చేశారు. ఫోరెన్సిక్ టెస్టుల తర్వాత 600 మందిని ఖననం చేసినట్లు తెలిపారు. అయితే వారంతా ఏ కారణంగా చనిపోయారన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈక్వెడార్​లో ఫిబ్రవరి 29న మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా ఇప్పటిదాకా మొత్తం 7,500 కేసులు ఫైల్ అయ్యాయి. తీరప్రాంత ప్రావిన్స్ అయిన గుయాస్ లో 70 శాతం మందికి కరోనా సోకింది. ఒక్క కేపిటల్ సిటీ గ్వయక్విల్ లోనే 4 వేల కేసులు రికార్డయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఎఫెక్టుతో గుయాస్​లో ఏప్రిల్ నెలలోనే 2,500 నుంచి 3,500 మంది మృత్యువాత పడొచ్చని మెడికల్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.