
డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై లారీలను ఆపి వీరంగం సృష్టించాడు. కానిస్టేబుల్ వీరంగానికి ఆ ప్రాంతం పూర్తిగా వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను ప్రశ్నించిన వారిపైకి బూతు పురాణాలతో నోటికి వచ్చిన బూతులతో తిడుతూ నానా హంగామా సృష్టించాడు. ఈ సంఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి రాజమల్లయ్య గత అర్ధరాత్రి పీకలదాకా మద్యం సేవించి తన కారును రోడ్డు మధ్యలో ఆపి మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. గచ్చిబౌలి నుండి కారులో వస్తున్న అశ్వీన్ రెడ్డి దంపతులను సైతం ఆపి నోటికి వచ్చిన బూతులు తిడుతూ పైపైకి వచ్చాడని తెలిపారు. దీంతో అశ్విన్ రెడ్డి 100 నెంబర్ కు కాల్ చేయగా... సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించారు. అశ్విన్ రెడ్డి కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేయగా..పోలీసులు కేసు నమోదు చేసిన విచారిస్తున్నారు.