- తల్లీకూతుళ్ల మృతి కేసును ఛేదించిన పోలీసులు
- అక్రమ సంబంధం అనుమానంతో దారుణం
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు నారాయణదాస్ గూడలో గ్యాస్ లీకై మంటలు చెలరేగి తల్లీకూతురు చనిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం అనుమానంతో భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తేల్చారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డుకు చెందిన వడ్డె శ్రీనివాస్, లావణ్య (30) దంపతులకు పావని (14), పవన్ (8) సంతానం. శ్రీనివాస్ చేవెళ్ల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఓ కమిషన్ ఏజెంట్ వద్ద హమాలీగా పనిచేస్తున్నాడు.
మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కొన్నాళ్లుగా భార్యతో గొడవపడుతున్నాడు. ఆదివారం కూడా గొడవ జరిగింది. తర్వాత పడుకోగా తెల్లవారుజామున శ్రీనివాస్ తన భార్య, కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలకు గ్యాస్ సిలిండర్ పైపు కాలిపోవడంతో గ్యాస్ లీకై మరింత ఎక్కువయ్యాయి. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. సోమవారం ఉదయం లావణ్య, మధ్యాహ్నం కూతురు పావని చనిపోయారు.
కుమారుడు పవన్ మాత్రం వేరే గదిలో తాత వద్ద నిద్రించడంతో బతికిపోయాడు. అల్లుడిపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి పల్లపు వెంకటేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి విచారించగా.. భార్య , కుమార్తెపై పెట్రోల్ పోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని, ఈ నేరాన్ని చేస్తూ ఉండగా నిందితుడి చేతులకు కూడా గాయాలయ్యాయని సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. Police crack case involving dies of a mother

