బేగంపేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు

బేగంపేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు

మునుగోడు సమర భేరి సభను బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో  మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ లోని సాంబ మూర్తి నగర్ లో బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  వెళ్లనున్నారు. దాదాపు అరగంట పాటు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడనున్నారు. సత్యనారాయణ 30 సంవత్సరాలుగా బీజేపీలో పని చేస్తున్నాడు. అమిత్ షా రాక సందర్భంగా  పోలీసులు  బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయం, బీజేపీ కార్యకర్త నారాయణ ఇంటి  వరకు కాన్వాయ్ రిహార్సల్ చేశారు.

మునుగోడు సమర భేరి సభ’కు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా చీఫ్​ గెస్ట్​గా హాజరవుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే వేదికపై నుంచి బీజేపీలో చేరనుండటంతో ఈ సభకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్ సభకు మించి జనాన్ని తరలించి మునుగోడు ప్రజలు తమ వైపే ఉన్నారనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్య నేతలంతా మూడ్రోజులుగా మునుగోడులోనే మకాం వేసి ప్రతి పల్లెను టచ్ చేస్తూ సభకు జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టారు.