బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు బయల్దేరిన బీజేపీ ఎంపీ సోయం బాపురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా సమీపంలోని నందన్ ఎక్స్ రోడ్డు వద్ద సోయం బాపురావుతో పాటు పలువురు బీజేపీ నేతలను అడ్డుకొని లోకేశ్వరం పీఎస్ కు తరలించారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీలోకి సిబ్బంది మినహా ఇతరులను ఎవరినీ రానివ్వడం లేదు. యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
మరో వైపు బాసర ట్రిపుల్ ఐటీలో E1, E2 విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాత్రి 3 గంటల వరకు మెస్ లో జాగారం చేశారు. ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఇంచార్జ్ వీసీ వచ్చి చర్చలు జరిపినా విద్యార్థులు పట్టు వీడలేదు. తాము లేవనెత్తిన 5 డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో మెస్ టెండర్లు పిలిచారు. మిగితా 4 డిమాండ్లపై విద్యార్థులు నిలదీస్తున్నారు .
ఫుడ్ పాయిజన్ ఇష్యూ తర్వాత ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఐదు డిమాండ్లపై వీసీ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని మండిపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్ కు చెందిన సిబ్బంది మొత్తం త్వరలో రాజీనామా చేస్తారన్నారని.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు.
మెస్ మేనేజ్ మెంట్ కి ఇచ్చిన షోకాజ్ నోటీసుపై వారు వివరణ ఇచ్చారా లేదా అనేదానిపై ఎలాంటి అప్ డేట్ లేదంటున్నారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన శాంపిల్స్ రిపోర్టులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు. కారణం బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదని ఫైరవుతున్నారు. జూలై 24 నాటికి మెస్ ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పి ఆలస్యం చేశారన్నారు. తమ నిరసనతో ఆగమేఘాల మీద మెస్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేశారంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
