మణిపూర్​లో మళ్లీ హింస ..ఇంఫాల్​లో స్టూడెంట్స్ ర్యాలీ

మణిపూర్​లో మళ్లీ హింస ..ఇంఫాల్​లో స్టూడెంట్స్ ర్యాలీ
  • అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జ్
  • టియర్ గ్యాస్ ప్రయోగం..45 మందికి గాయాలు
  • పలువురి పరిస్థితి విషమం
  • మరో 6 నెలలు ‘అఫ్​స్పా’ చట్టం పొడగింపు

ఇంఫాల్ : ఇద్దరు స్టూడెంట్స్ హత్యకు గురయ్యారని తెలియడంతో మణిపూర్​లో మరోమారు ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంఫాల్ సిటీలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ మళ్లీ హింసాత్మకంగా మారింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ కిడ్నాప్, హత్యను ఖండిస్తూ పలు సంఘాలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాయి. సీఎం బీరెన్ సింగ్ ఇంటికి దగ్గర్లో వీరంతా నిరసనకు దిగారు.

ఈ క్రమంలోనే పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌‌‌‌ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

భారీగా బలగాల మోహరింపు

అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా మణిపూర్ పోలీసులతో పాటు సీఆర్​పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో బీరెన్ సింగ్ ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. స్టూడెంట్ల​ హత్యపై తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. పోలీసులే లాఠీచార్జ్ చేశారని స్టూడెంట్ యూనియన్ లీడర్లు తెలిపారు. పోలీసులే రెచ్చగొడుతున్నారని విమర్శించారు. స్టూడెంట్స్ అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్రొటెస్ట్​లో పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరు స్టూడెంట్స్ ఫొటోలు పట్టుకుని నిరసన తెలిపారు. వారి డెడ్​బాడీలు ఎక్కడున్నాయో గుర్తించి.. తల్లిదండ్రులకు అప్పగించాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్​లోనే ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

విచారణలో జాప్యంపై ఐటీఎల్ఎఫ్ నిరసన ర్యాలీ

ఐదు నెలలుగా ఆదివాసీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై కేంద్రం ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ కుకీ తెగకు చెందిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) మహిళా విభాగం బుధవారం చురచాంద్​పూర్​లో నిరసన చేపట్టింది. మణిపూర్​లో జరిగిన హింసాకాండపై విచారణ స్పీడప్ చేయాలని డిమాండ్ చేసింది. కుకీ తెగకు చెందిన మహిళలు, యువతులను రేప్ చేసి చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఐటీఎల్ఎఫ్ కన్వీనర్ మేరీ జోన్ కోరారు.

మైతీ వర్గానికి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ హత్యకు గురైతే వెంటనే స్పందించిన పోలీసులు.. తమ తెగకు చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించి రేప్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. కుకీ తెగపై ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని విమర్శించారు. గిరిజనులపై జరిగిన హింసాత్మక ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఐటీఎల్ఎఫ్  ర్యాలీ లంమ్కా పబ్లిక్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై తిపాయిముఖ్, ఐబీ రోడ్ మీదుగా వాల్ రీ మెంబరెన్స్ వరకు కొనసాగింది. 

మంగళవారం అర్ధరాత్రి అల్లర్లు

ఇంఫాల్​లో మంగళవారం అర్ధరాత్రి ఆర్ఏఎఫ్, స్థానికులకు మధ్య మొదలైన ఘర్షణలు బుధవారం కూడా కొనసాగాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు ఫైర్ చేశారు. సుమారు 45 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

పుకార్లు వ్యాపించకుండా అక్టోబర్ 1, రాత్రి 7.45 దాకా ఇంటర్​నెట్ సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. గురువారం మిలాద్ ఉన్ నబీ (మహ్మద్ ప్రవక్త బర్త్ డే)ని పురస్కరించుకుని, లా అండ్ ఆర్డర్ కారణంగా శుక్రవారం స్కూల్స్​కు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. మే 3న ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

మణిపూర్ ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటన

తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్​ను ‘కల్లోలిత ప్రాంతం’ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం ‘అఫ్​స్పా’ను మరో 6 నెలల పాటు పొడగిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలో 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో తప్ప మిగిలిన అన్ని చోట్లా అక్టోబర్ 1 నుంచి ఇది అమలు చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మణిపూర్ అల్లర్లలో ఇప్పటి దాకా 175 మంది చనిపోగా.. వేలాది మంది గాయపడ్డారు.

మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : కాంగ్రెస్

మణిపూర్ ప్రజలు 147 రోజులుగా కష్టాలు పడుతున్నారని, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రాన్ని సందర్శించే సమయం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని ఇప్పుడు స్పష్టమైందన్నారు. మణిపూర్​లో అల్లర్లు కంట్రోల్ చేయడంలో కేంద్రం విఫలమైందని, వెంటనే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం బీరేన్ సింగ్ అసమర్థ నేత అని మండిపడ్డారు.

మణిపూర్ హింసకు మహిళలు, చిన్నారులను ఆయుధాలుగా మార్చుకున్నారని, ఈశాన్య రాష్ట్రాన్ని బీజేపీ రణరంగంగా మారుస్తున్నదని ఆరోపించారు. స్టూడెంట్స్​ను కొందరు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. వేలాది కుటుంబాలు అడవి బాట పట్టాయని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అన్నారు. ప్రభుత్వంతో పాటు సీఎం బీరెన్​సింగ్​పై అక్కడి ప్రజల్లో నమ్మకం లేదన్నారు. మణిపూర్​లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటే సీఎంను తొలగించాలని వివరించారు.