
ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఆడటం కంటే.. పోలీసు డ్యూటీ చేయడమే కష్టంగా ఉందని 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ అన్నాడు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జోగిందర్.. కరోనాను తరిమి కొట్టేందుకు 24 గంటల పాటు డ్యూటీ చేస్తున్నానని చెప్పాడు. ‘మార్నింగ్ 9 గంటలకు డ్యూటీకి వెళ్తే.. రాత్రి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. కొన్నిసార్లు అర్జెంట్‌కాల్స్ తో రాత్రంతా బయటే ఉండాల్సిన పరిస్థితి. నా ఫ్యామిలీ రోహ్‌తక్‌లో ఉంటుంది. 110 కి.మీల దూరంలో ఉండే హిస్సార్‌లో నా డ్యూటీ. నా పరిధిలో హిస్సార్ జిల్లా రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి రోజు చెక్‌పోస్ట్ వద్ద నిలబడి డ్రైవర్లు, ప్రైవేట్ వాహనాలకు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఇదంతా కష్టంగా అనిపించినా.. దేశం కోసం చేస్తున్నామని సరిపెట్టుకుంటున్నా. రోజుకు చాలా మందిని కలుస్తుండటంతో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా’ అని జోగిందర్ వెల్లడించాడు.