ఇళ్లు జాగ్రత్త: పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసుల సూచన

ఇళ్లు జాగ్రత్త: పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసుల సూచన

హైదరాబాద్: పండుగ రోజుల్లో జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు సిటీ పోలీసులు. సంక్రాంతికి చాలామంది సొంతూళ్లకు వెళ్తుండటంతో ఇళ్లల్లో దొంగలు పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్  మాల్స్ లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. వెహికిల్స్ బయటే ఉంచిపోవాల్సివస్తే ఆరుబయట వాహనాలకు హాండిల్  లాక్ తో పాటు వీల్  లాక్  వేసుకోవాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఉన్నా.. పక్కవారిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిదంటున్నారు. ఇంట్లో డబ్బు, బంగారం  ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, లేకపోతే వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.

ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం మంచిదంటున్నారు పోలీసులు. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మొబైల్ తో ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్ లో చూసుకునే వీలుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలు కొనుగోలు చేసుకుంటే ఎప్పటికైనా ఉపయోగం. సొంత ఇల్లు ఉన్నవారు ఇంటి మెయిన్ డోర్ కి గ్రిల్స్ అమర్చుకుంటే రెండంచెల భద్రత ఇస్తుంది. ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించడం బెటర్. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశాలె, పాత గ్రిల్స్ , బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు పోలీసులు.  ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్  నెంబర్, వీధుల్లో వచ్చే బీట్  కానిస్టేబుల్  ఫోన్ నెంబర్  దగ్గర పెట్టుకోవాలి. అపార్ట్ మెంట్లో  కొత్తవారు ఎవరొచ్చినా వాచ్ మన్ రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి అడ్రెస్, ఫోన్  నెంబర్  ను సంబంధిత పోలీసు స్టేషన్ కి ఇవ్వాలి. దీంతో ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్  లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్  నెంబర్  9490617444 కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు.