
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ స్మగ్లర్ టోనీ నుంచిడ్రగ్స్ కొన్న తొమ్మిది మంది కస్టమర్లను కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించకపోవడంతో.. ఆ ఉత్తర్వులను పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. కస్టమర్లనూ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ లక్ష్మణ్ చెప్పారు. పీపీ ప్రతాప్‌రెడ్డి పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ.. డ్రగ్స్కస్టమర్లను కూడా పూర్తి స్థాయిలో విచారిస్తేనే వాళ్లు.. ఇతరులకు కూడా ఏమైనా డ్రగ్స్ సప్లయ్ చేశారో లేదో తేలుతుందని, టోనీ నుంచే కాకుండా ఇతర సప్లయర్స్ నుంచి వీళ్లు డ్రగ్స్ కొన్నారో లేదో తేల్చాల్సి ఉందన్నారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా పోలీసులు ఛేదించాల్సిఉందన్నారు. పోలీసుల విచారణ కోసం కస్టమర్లను కస్టడీకి అనుమతించకుండా కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. డ్రగ్స్ కస్టమర్లుగా ఉన్న నిరంజన్ కుమార్ జైన్, శశ్వత్ జైన్, యజ్ఞానంద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావు, మరొకరిని పోలీసులు విచారణ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వినియోగదారుడికి, డ్రగ్స్ సప్లయ్‌దారుడికి చాలా తేడా ఉందని, బలహీనత కోణంలోనే కస్టమర్‌ను చూడాలని తొమ్మిది మంది తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. రిమాండ్ రిపోర్టులో వినియోగదారులనే ఉందన్నారు. పోలీస్ కస్టడీ ఉత్తర్వులు అవసరం లేదన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టుకు వ్యతిరేకంగా కస్టడీ కోరడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. వాదనల విన్న హైకోర్టు ఉత్తర్వులను వాయిదా వేసింది.