వివాహేతర సంబంధం కారణంగానే చిన్నారి హత్య

వివాహేతర సంబంధం కారణంగానే చిన్నారి హత్య

పంజాగుట్ట చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ చిన్నారిని చంపింది తల్లేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్‎లోని అజ్మీర్‌‌‎లో ఇద్దరు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ హత్యలో చిన్నారి తల్లికి మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఓల్డ్ సిటీకి చెందిన వారిగా తేల్చారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.

‘ఈ నెల 4వ తేదీన ద్వారక పూరి కాలనీలో 4 ఏళ్ళ చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని పడేసి వెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. ఈ కేసును ఛేదించడానికి 10 రోజుల సమయం పట్టింది. వందలాది సీసీ కెమెరాల ద్వారా విచారణ జరిపి కేసును ఛేదించాం. మృతి చెందిన చిన్నారి పేరు బేబీ మెహక్. 

మియాపూర్‎కు చెందిన మహమ్మద్ అహ్మద్, హీన బేగం దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా.. మహ్మద్ అహ్మద్ గత కొద్ది రోజుల నుంచి దొంగతనం కేసులో జైల్లో ఉంటున్నాడు. దాంతో హీన బేగంకు ఓల్డ్ సిటీకి చెందిన షేక్ మహమ్మద్ అలియాస్ ఖాదర్‎తో హీనకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేస్తున్నారు. వీరు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయి ఢిల్లీ, బొంబాయి, బెంగళూరులో పిల్లలతో బెగ్గింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న వీరిద్దరూ.. ఇరవై రోజుల నుంచి ఉంటూ బెగ్గింగ్ చేస్తున్నారు. హీన బేగం కూతురు మెహక్ బెగ్గింగ్ చేయడానికి నిరాకరించడంతో పాటు.. తండ్రి దగ్గరకు వెళ్తానని గొడవ చేసింది. దాంతో హీన బేగం, ఖాదర్ తో కలిసి చిన్నారిని దారుణంగా కొట్టి హత్య చేసింది. అనంతరం బస్సులో మృతదేహాన్ని బెంగుళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పంజాగుట్ట సమీపంలో ద్వారకాపురి కాలనీలో పడేసి.. తిరిగి బెంగుళూరు వెళ్లిపోయారు. శుక్రవారం నగరానికి తిరిగొచ్చిన నిందితులిద్దరినీ అరెస్ట్ చేశాం’ అని వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఆర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఖాదర్ పై గతంలో ఎలాంటి కేసులు లేవని.. కేవలం తాగుడుకు బానిసకావడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టారని సీపీ తెలిపారు.