ఆ నలుగురిని చంపింది ఒక్కడే!..డబ్బు కోసం హసీనా చెల్లె కొడుకే హత్యలు చేసినట్టు గుర్తింపు 

ఆ నలుగురిని చంపింది ఒక్కడే!..డబ్బు కోసం హసీనా చెల్లె కొడుకే హత్యలు చేసినట్టు గుర్తింపు 
  • యూట్యూబ్‌‌లో చూసి నలుగురిని చంపి పారిపోయిన నిందితుడు  
  • నిందితుడితోపాటు అతని భార్య, ఫ్రెండ్, జ్యువెలరీ వ్యాపారి అరెస్ట్

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ నలుగురిని చంపింది ఒక్కడేనని తేల్చారు. హసీనా చెల్లె కొడుకు సయ్యద్ అస్లాం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు  నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్టు చెప్పారు.

ఈ నెల 22న తెలంగాణ కాలనీలోని ఓ ఇంట్లో హసీనా, ఆమె భర్త సుల్తాన్, పిల్లలు ముజమ్మిల్, అఫ్సానా మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీం సహాయం తో కేసును ఛేదించారు. హసీనా బంధువులైన సయ్యద్ అస్లాం, అతని భార్య తబస్సుం, అస్లాం స్నేహితుడు మహమ్మద్ సోహైల్, జ్యువెలరీ వ్యాపారి హేమంత్ కుమార్ ను అరెస్ట్​చేశారు. డబ్బు కోసమే అస్లాం ఈ హత్యలు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.

డబ్బు కోసమే హత్యలు..

అప్పుల బాధతో ఉన్న అస్లాం గతంలో హసీనా వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని వడ్డీ చెల్లిస్తున్నాడు. తన భార్య గర్భవతి కావడంతో కొత్త కారు కొనేందుకు మరోసారి డబ్బు అడగగా ఆమె నిరాకరించడంతోపాటు పాత అప్పు తిరిగి ఇవ్వాల ని ఒత్తిడి చేసింది. దీంతో హసీనాపై అస్లాం కక్ష పెంచుకున్నాడు. అస్లాం అతని భార్య తబస్సుం.. హసీనా కూతురు బుశ్రాను సంప్రదించగా తనకు కూడా తల్లి ఎలాంటి సహాయం చేయడం లేదని, మొత్తం సుల్తాన్ పిల్లలైన ముజమ్మిల్, అఫ్సానాకే పెడుతున్నదని, ఇంట్లో డబ్బు, బంగారు నగలు ఉన్నాయని సమాచారం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో  ఫిబ్రవరి 28న అస్లాం తన స్నేహితుడు సోహైల్ తో కలిసి హసీనా ఇంట్లో లేని సమయంలో  దొంగతనానికి ప్రయత్నం చేయగా అక్కడ ఎలాంటి డబ్బు, బంగారం దొరకలేదు. బంగారం హసీనా ఒంటి మీదే ఉండడంతో ఆమె హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం యూట్యూబ్‌‌లో హత్య చేసి ఎలా తప్పించుకోవాలనే వీడియోలు కూడా చూసినట్టు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు.

ఈ నెల 20న మర్డర్..

అస్లాం ఈ నెల 20న సుల్తాన్ కు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని సమాచారం ఇచ్చాడు. ఆయన స్పందించకపోవడంతో తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి హసీనా, సుల్తాన్, ముజమ్మిల్‌‌ ను కత్తితో పొడిచి చంపాడు. తనను గుర్తించే అవకాశం ఉందని భావించి మంచం కింద దాక్కున్న 12 ఏండ్ల అఫ్సానాను కూడా హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, కొంత నగదు, భూమి, బ్యాంకు పత్రాలను తీసుకొని హైదరాబాద్‌‌  పారిపోయాడు. దోచుకున్న బంగారాన్ని దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌లోని ఓ జ్యువెలరీ  షాపులో తాకట్టు పెట్టి రూ.5.30 లక్షల లోన్​ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో అస్లాం, తబస్సుం, సోహైల్, హేమంత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి మ హీంద్రా మరాజో కారు, రూ.3 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్‌‌ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారు ముద్ద, ల్యాండ్ డాక్యుమెంట్లు, బ్యాంకు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సీసీఎస్ బృందం సభ్యులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.