- సిబ్బందికి పోలీస్ వెల్ఫేర్ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: పోలీసు సిబ్బంది ఆరోగ్య భద్రత (హెల్త్ కార్డు) కేవలం నిమ్స్ ఆసుపత్రిలోనే చెల్లుతాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని..అలాంటి పుకార్లను నమ్మవద్దని పోలీస్ వెల్ఫేర్ డీఎస్పీ కె. శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. దాని ప్రకారం.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆరోగ్య భద్రత చికిత్సలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు.
ఈ పథకం ఎక్కడా రద్దు కాలేదని తెలిపారు. పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు, కుటుంబ సభ్యులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చికిత్స సౌకర్యం ఉందని వివరించారు. అయితే, ఈ మొత్తం కంటే ఎక్కువ ఖర్చయ్యే దీర్ఘకాలిక లేదా సంక్లిష్ట చికిత్సలకు నిమ్స్ ఆస్పత్రులో పూర్తి ఖర్చును ఆరోగ్య భద్రత నుంచే పొందవచ్చన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీలో లేని చికిత్సలు కూడా నిమ్స్‌లో ఫ్రీగా అందుతున్నాయని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి గందర గోళానికి గురికావద్దని, అధికారిక సమాచారం కోసం పోలీస్ వెల్ఫేర్ విభాగాన్ని సంప్రదించాలని పోలీసు సిబ్బందిని కోరారు.
