మిస్టరీగా శిరీష కేసు?.. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కేసు కొలిక్కి

మిస్టరీగా శిరీష కేసు?.. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కేసు కొలిక్కి
  •  ఇద్దరు స్థానికుల నుంచి వివరాల సేకరణ
  • డెడ్​బాడీని మళ్లీ పరిశీలించిన డాక్టర్
  •  యువతి కాల్​డేటా ఆధారంగా దర్యాప్తు
  • పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కేసు కొలిక్కి

పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి కేసులో  పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. జిల్లాలోని కాళ్లాపూర్​ గ్రామానికి చెందిన శిరీష (19) శనివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికెళ్లి ఆదివారం ఉదయం ఊరి శివారులోని నీటికుంటలో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఆమె తల, గొంతుపై గాయాలతో పాటు రెండు కండ్లలోనూ ఎవరో పొడిచినట్లు ఉండటం, ఇతర శరీర భాగాలపై బ్లేడుతో చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. ఆమె బయటికొచ్చే ముందు తన అక్క భర్త అనిల్​తో గొడవపడినట్లు తెలుసుకున్న పోలీసులు ఆదివారం అతనితో పాటు శిరీష తండ్రి జంగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. సోమవారం మరోసారి వారిని ప్రశ్నించారు. ఇంట్లో గొడవ జరిగినప్పుడు శిరీష సెల్​ఫోన్​ను ఆమె బావ లాక్కున్నట్లు తెలుసుకుని అతడి నుంచి మొబైల్​ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శిరీష బయటికెళ్లిన తర్వాత గ్రామంలో ఎవరికైనా కనిపించిందా అన్న కోణంలో ఇద్దరు స్థానికులను కూడా విచారించారు. వారు ఆమెను ఎక్కడ చూశారో వివరాలు తెలుసుకున్నారు. కాగా, శిరీష డెడ్​బాడీ పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంది. అయితే, సోమవారం కేసు విచారణలో భాగంగా పరిగికి చెందిన డాక్టర్  వైష్ణవి మరోసారి ఆమె డెడ్​బాడీని పరిశీలించారు. యువతి శరీర భాగాలకు ఉన్న గాయాలకు, చనిపోయిన తీరుకు ఎలాంటి తేడా లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కంటిపై, తలపై గాయాలు చనిపోయేంత తీవ్ర స్థాయిలో లేవని తేలినట్లు సమాచారం. శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టినా.. నీటికుంట మరీ లోతుగా లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. పోస్టుమార్టం రిపోర్టును ల్యాబ్​కు పంపామని పరిగి డీఎస్పీ కరుణ సాగర్  రెడ్డి తెలిపారు. రిపోర్టు వచ్చిన తర్వాతే ఈ కేసు కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు.

అంత్యక్రియలు పూర్తి

శిరీష అంత్యక్రియలు సోమవారం గ్రామంలో పూర్తయ్యాయి. అంతకుముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హంతకుడెవరో తేల్చే వరకు అంత్యక్రియలు జరగనివ్వబోమంటూ జంగయ్య ఇంటిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

మూడు రోజుల్లో నివేదిక ఇవ్వండి: జాతీయ మహిళా కమిషన్  

న్యూఢిల్లీ, వెలుగు: శిరీష అనుమానాస్పద మృతిపై జాతీయ మహిళా కమిషన్ సుమో టోగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర వివరాలతో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్  చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయా లని డీజీపీని రేఖా శర్మ ఆదేశించారు.