ఈటల కాన్వాయ్పై దాడి ఘటన.. దర్యాప్తు షురూ

ఈటల కాన్వాయ్పై దాడి ఘటన.. దర్యాప్తు షురూ

మునుగోడు మండలం పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఎంక్వైరీ ప్రారంభించారు. ఘటనా స్థలానికి వెళ్లి ఏం జరిగిందో ఆరా తీశారు. ఇప్పటికే ఈ దాడిపై కేసు నమోదైంది. ఎవరు చేశారు.. ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి రెండు పార్టీల నేతలు ఇప్పటికే స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఓ వైపు దర్యాప్తు జరుగుతుండగానే.. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. నవంబర్ 3న పోలింగ్ ఉండటంతో.. దీని ప్రభావం పోలింగ్ పై పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కడా గొడవలు జరగకుండా భద్రతను పెంచారు. 

మధ్యాహ్న సమయంలో పలివెలలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. అంతకుముందు ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా.. కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కబెట్టారు. ఈ ఘటనపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరి పై ఒకరు వాక్బాణాలు సంధించుకున్నారు. కావాలనే అల్లర్లు సృష్టించారని టీఆర్ఎస్ అంటుంటే.. తమ పై కక్ష కట్టి ప్రచారానికి వెళ్లకుండా కుట్ర చేశారని బీజేపీ ఆరోపించింది.