వాట్సాప్‌‌ గ్రూపుల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులకు పోలీసుల కాల్స్‌‌

వాట్సాప్‌‌ గ్రూపుల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులకు పోలీసుల కాల్స్‌‌
  • వాట్సాప్‌‌ గ్రూపుల్లో ఉన్న వారికి పోలీసుల కాల్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌ రైల్వేస్టేషన్‌‌ విధ్వంసం కేసు ఆర్మీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. అగ్నిపథ్‌‌ను వ్యతిరేకిస్తూ వాట్సాప్‌‌ గ్రూపుల్లో చాటింగ్‌‌ చేసిన వారిని గుర్తిస్తున్న పోలీసులు వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చుతున్నారు. సీన్‌‌ ఆఫ్‌‌ అఫెన్స్‌‌లో లేని వారికి కూడా విచారణకు రావాలని కాల్స్ చేస్తున్నారు. దీంతో విధ్వంసంలో పాల్గొనని వారు తమను ఎక్కడ అరెస్ట్​ చేస్తారో అని టెన్షన్​ పడుతున్నారు. ఈ కేసులో జీఆర్‌‌‌‌పీ పోలీసులు 46 మందిని అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కి తరలించిన సంగతి తెలిసిందే. మరో 10 మంది పరారీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సోమ, మంగళవారాల్లో మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

గ్రూప్‌‌ అడ్మిన్స్‌‌ డాటా ఆధారంగా..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మలవెల్లి మధుసూదన్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లా సోనాపూర్‌‌‌‌కు చెందిన రాథోడ్ ఫృధ్వీరాజ్‌‌, బెంగి రమేశ్​ విధ్వంసంలో కీలక పాత్ర పోషించినట్లు జీఆర్‌‌‌‌పీ పోలీసులు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో వెల్లడించారు. ఆందోళనల కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌‌ గ్రూప్స్‌‌ క్రియేట్‌‌ చేశారని, చైన్‌‌ సిస్టంలో ప్రైవేట్‌‌ డిఫెన్స్‌‌ అకాడమీల్లోని అభ్యర్థులను యాడ్‌‌ చేశారని గుర్తించారు. సికింద్రాబాద్‌‌, వైజాగ్‌‌, విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్స్‌‌లో ఆందోళనలకు రెండు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్లాన్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.

బయట ఉన్న వాళ్లనూ అరెస్ట్ చేశారు 

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్‌‌లో అల్లర్ల తర్వాత రైల్వేస్టేషన్‌‌ బస్టాప్స్‌‌, రేతిఫైల్​ బస్టాప్‌‌ పరిసర ప్రాంతాల్లో అనుమానితులను టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చేర్యాలకు చెందిన మహేశ్, మల్కాజిగిరి లాలాపేటకు చెందిన రాజ సురేందర్‌‌‌‌ కుమార్‌‌‌‌ సహా 35 మందిని టాస్క్‌‌ఫోర్స్‌‌ ఆఫీస్‌‌కు తరలించారు. రాత్రి వరకు వారందరి వాట్సాప్ గ్రూపులు, వారి పోస్టింగ్స్‌‌ పరిశీలించారు. సురేందర్‌‌‌‌ వాట్సాప్‌‌లో వాయిస్‌‌ రికార్డింగ్‌‌ గుర్తించారు. ఎలాంటి పోస్టింగ్స్ చేయని వారి నుంచి వివరాలు తీసుకుని వదిలేశారు.

టాస్క్‌‌ఫోర్స్‌‌ అందించిన వివరాలతో కేసులు

టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు సేకరించిన ఫోన్ నంబర్స్‌‌, అభ్యర్థుల వివరాల ఆధారంగా జీఆర్‌‌‌‌పీ పోలీసులు నిందితుల లిస్ట్‌‌ తయారు చేశారు. ఈ క్రమంలోనే చేర్యాలకు చెందిన మహేశ్​తో పాటు మరికొందరిని రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో నిందితులుగా చేర్చారు. దీంతో పాటు వాట్సాప్‌‌ గ్రూపుల్లో ఉన్న మెంబర్స్‌‌కి కాల్స్‌‌ చేసి వివరాలు రాబడుతున్నారు. అవసరమైతే విచారణకు రావాలని ఆదేశిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌‌తో తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఆర్మీ అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు.

పోలీసుల అదుపులో సుబ్బారావు

సాయి డిఫెన్స్‌‌ అకాడమీ డైరెక్టర్‌‌‌‌ ఆవుల సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని నరసరావుపేట పల్నాడు ఎస్పీ ఆఫీస్‌‌ నుంచి మంగళవారం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌‌  రైల్వే స్టేషన్‌‌ విధ్వంసం కేసులో సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సుబ్బారావు పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించారు. వాట్సాప్‌‌ గ్రూపుల్లో చాటింగ్ ల ఆధారంగా ఆయన అకాడమీకి చెందిన 10 బ్రాంచ్‌‌ల అభ్యర్థులు ఉన్నట్లు గుర్తించారు.

ఆయనే ఆర్మీ అభ్యర్థులను ఆందోళనకు రెచ్చగొట్టారని అనుమానిస్తున్నారు. బుధవారం నుంచి స్పెషల్‌‌ టీమ్‌‌ ఆధ్వర్యంలో సుబ్బారావును విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ముగ్గురు వాట్సాప్‌‌ గ్రూప్‌‌ అడ్మిన్లు సహా 15 మంది అభ్యర్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.