పెట్రోల్​ స్ప్రే చేసి అధికారులకు నిప్పు

పెట్రోల్​ స్ప్రే చేసి అధికారులకు నిప్పు

జగిత్యాల, వెలుగు: గ్రామంలో రోడ్డు సమస్య పరిష్కారం కోసం వెళ్లిన పోలీసులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులపై పెట్రోల్​ స్ప్రే చేసి.. నిప్పు పెట్టాడో వ్యక్తి. ఈ ఘటనలో ఎంపీవో తీవ్రంగా గాయపడగా.. ఎస్ఐ తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్​పూర్​ మండలం తుంగూర్​లో చుక్క గంగాధర్, తిరుపతి అనే ఇద్దరి మధ్య మట్టి రోడ్డు విషయమై ఏడాదిగా వివాదం నడుస్తోంది. గ్రామంలోని 20 కుటుంబాలు ఇదే దారి నుంచి ఊళ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ దారి తనదేనని, ఎవరూ అటుగా పోవడానికి వీల్లేదని గంగాధర్​ చాలారోజులుగా కర్రలు అడ్డంపెడుతున్నాడు. అది గంగాధర్​జాగా కాదని, తొవ్వ అని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అయినా దారి వదలని గంగాధర్​ఆ భూమిని తన పేరున రిజిస్ట్రేషన్​చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. గ్రామస్తులు ఈ విషయమై కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రోడ్డు గుండా ఎవరూ వెళ్లకుండా గంగాధర్​ కర్రలు అడ్డంగా పెట్టాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు వివరాలు తెలుసుకునేందుకు మంగళవారం గ్రామానికి వస్తున్నట్టు గంగాధర్​ తెలుసుకున్నాడు. పురుగు మందు పిచికారీ చేసే డబ్బాలో పెట్రోల్​పోసి రెడీగా పెట్టుకున్నాడు. అధికారులు వచ్చి కర్రలు తొలగిస్తుండగా బీర్పూర్​ఎస్ఐ గౌతమ్​పై గంగాధర్ పెట్రోల్​స్ప్రే చేశాడు. ఆయన తప్పించుకోగా బీర్పూర్​ఎంపీవో రామకృష్ణపై పెట్రోల్​పోసి నిప్పంటించాడు. మంటలు అంటుకోవడంతో ఆయన అక్కడ్నుంచి పరిగెత్తుతూనే షర్ట్ ​విప్పేశాడు. వెంటనే అక్కడున్నోళ్లు మంటలు ఆర్పేశారు. రామకృష్ణను జగిత్యాల ఆస్పత్రికి  తరలించారు. గంగాధర్​ను అరెస్ట్ చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలె

హైదరాబాద్, వెలుగు: డ్యూటీలో ఉన్న అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పంచాయతీ సెక్రటరీల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్ , విజయ్, పంచాయతీ సెక్రటరీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.