బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు అడుగడుగునా..

బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు అడుగడుగునా..
  • కామారెడ్డి జిల్లా బూర్గుల్​కు నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డగింత
  • వివేక్​ వెంకటస్వామితోపాటు పలువురు నేతలు అదుపులోకి కార్యకర్తల అరెస్టు
  • రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే అరుణతార
  • టీఆర్​ఎస్​ గూండాగిరి చేస్తున్నది : వివేక్ వెంకటస్వామి​
  • కేసీఆర్​కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక

కామారెడ్డి / నిజాంసాగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస-.. బీజేపీ భరోసా’ యాత్రపై పోలీసులు  ఓవర్​ యాక్షన్​ ప్రదర్శించారు. శుక్రవారం బూర్గుల్​ గ్రామంలో జెండా ఆవిష్కరణకు బయలుదేరిన నేతలను అడుగడుగునా అడ్డుకున్నారు. రోడ్లపైన బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

గ్రామానికి వెళ్లకుండా తున్కిపల్లి దగ్గర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి, జెడ్పీ మాజీ చైర్మన్​ కాటిపల్లి వెంకటరమణరెడ్డి తదితరులను అదుపులోకి తీసుకొని జీపులో ఎక్కించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార రోడ్డుపై బైఠాయించారు. చివరికి.. పోలీస్​ వలయాన్ని ఛేదించుకొని పంట పొలాల నుంచి కొంత మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు  బూర్గుల్​కు చేరుకొని పార్టీ  జెండా ఎగుర వేశారు.  

‘ప్రజా గోస..- బీజేపీ భరోసా’ యాత్రంలో భాగంగా బూర్గుల్​లో బీజేపీ  జెండా ఆవిష్కణకు గద్దె నిర్మించగా టీఆర్​ఎస్​ శ్రేణులు గురువారం రాత్రి కూల్చివేశాయి. ప్రోగ్రాం కోసం వెళ్లిన బీజేపీ నేతలను టీఆర్​ఎస్ నేతలు  అడ్డుకున్నారు.  ఇరు వర్గాల మధ్య రాత్రి ఘర్షణ జరిగింది.  పోలీసుల హామీతో  ఆందోళన విరమించిన బీజేపీ నేతలు శుక్రవారం అక్కడ జెండా ఎగుర వేస్తామని ప్రకటించారు. దీంతో పొద్దుటి నుంచే జిల్లా నలుమూలల నుంచి పోలీసులను రప్పించి బూర్గుల్​కు వెళ్లే మార్గంలో రోడ్లపై భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. బొగ్గు గుడసె వద్ద చెక్​ పోస్టు ఏర్పాటు చేసి  వాహనాలు తనిఖీ చేశారు.

పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతారతో పాటు లీడర్లు, కార్యకర్తలు ర్యాలీగా తున్కిపల్లికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నడ్చుకుంటూ బూర్గుల్​ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో  పోలీసులు అడ్డుకున్నారు.  అడ్డంగా రోప్​ పార్టీ తాడు పట్టుకొని ముందుకెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. బూర్గుల్​కు వెళ్లి పార్టీ జెండా ఎగుర వేస్తే తప్పేమిటని, శాంతియుతంగా వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు.  ఆ ఊరిలో పరిస్థితి బాగా లేదని, ఇప్పుడు అక్కడికి వెళ్లటం మంచిది కాదని పోలీసు ఆఫీసర్లు చెప్పారు. కనీసం ఐదుగురు వెళ్లి జెండా ఎగుర వేసి వస్తారని చెప్పినా వినకుండా అడ్డుకున్నారు. వివేక్​వెంకటస్వామి,  కాటిపల్లి వెంకటరమణరెడ్డి తదితరులను పోలీసు జీపు ఎక్కించి పోలీస్​ స్టేషన్​కు తరలించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గంటకు పైగా వారిని పోలీసు జీపులోనే కూర్చోబెట్టారు.  

రోడ్డుపై బైఠాయించిన అరుణతార

తున్కిపల్లిలో బీజేపీ నేతల్ని అడ్డుకున్న క్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార బూర్గుల్​ వైపు కొంత దూరం పరుగెత్తుకుంటువెళ్లారు.  పోలీసులు అడ్డుకోవండతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  

వివిధ మార్గాల్లో వెళ్లి జెండా ఆవిష్కరణ

బూర్గుల్​ గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడుగుడుగునా ఆటంకాలు కలిగించినప్పటికీ కొందరు బీజేపీ లీడర్లు, కార్యకర్తలు పంట పొలాల్లో నుంచి నడ్చుకుంటూ బూర్గుల్​కు చేరుకొని రెండు చోట్ల పార్టీ జెండాలను ఎగురవేశారు. కొంత మంది స్థానిక యువకులను కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడికి మహిళ మోర్చా స్టేట్​ ప్రెసిడెంట్​ గీతామూర్తి , పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్​ సాయిలు కూడా చేరుకున్నారు. అనంతరం అందరూ తిరిగి తున్కిపల్లికి వచ్చారు. జెండా ఎగుర వేయటానికి వెళ్లిన కార్యకర్తలకు సపోర్టుగా నిలిచిన  బూర్గుల్​ యువకులను వివేక్​వెంకటస్వామి, అరుణతార సన్మానించారు.

కేసీఆర్​కు గుణపాఠం తప్పదు: వివేక్​

పోలీసులను అడ్డుపెట్టుకొని టీఆర్​ఎస్​ గూండాగిరి చేస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ ప్రోగ్రామ్​కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్​ఎస్​ నేతలు పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని అన్నారు.  కేసీఆర్​ సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ రాజ్యం నడుస్తున్నదని దుయ్యబట్టారు.  శాంతియుతంగా కార్యక్రమం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్​కు  ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎంత అడ్డుకున్నా బీజేపీ కార్యకర్తలు వెళ్లి జెండా ఎగుర వేశారని, బీజేపీ శ్రేణులు ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార మాట్లాడుతూ.. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

పోలీసుల తీరును ఖండించిన  సంజయ్, బాషా

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతారను బూర్గుల్​కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా వేర్వేరు ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ కేడర్​పై టీఆర్ఎస్ నాయకులు బరితెగించి దాడికి పాల్పడుతున్నారని బండి సంజయ్​  మండిపడ్డారు. బీజేపీ జెండాలను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని తెలిపారు.