డెలివరీ బాయ్​కి పోలీసులు బైక్ కొనిచ్చిన్రు

డెలివరీ బాయ్​కి పోలీసులు  బైక్ కొనిచ్చిన్రు

భోపాల్: పోలీసులు అనగానే అందరికీ ఒక నెగెటివ్ ఫీలింగ్.. ఖాకీ చొక్కా చూడగానే ఒకలాంటి భయం. కానీ తామూ అందరిలాంటి మనుషులమేనని.. తమకు కూడా ఇతరుల పట్ల జాలి, దయ ఉంటాయని మధ్యప్రదేశ్ పోలీసులు నిరూపించారు. సైకిల్ మీద ఫుడ్​ పార్సిల్స్ డెలివరీ చేస్తున్న ఒక యువకుడి కష్టాన్ని చూడలేక బైక్ కొనుగోలుకు సాయంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి తహజీబ్ ఖాజి సోమవారం నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి చెమటలు కక్కుతూ సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేయడం చూశాడు. దీంతో అతడిని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తన పేరు జే హాల్దే అని.. ప్రతీ రోజు సైకిల్ మీదే ఫుడ్ డెలివరీ చేస్తానని చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బైక్  కొనుగోలు చేయలేకపోతున్నానని చెప్పాడు. దీంతో చలించిపోయిన తహజీబ్.. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లోని తన కొలీగ్స్​తో కలిసి బైక్ ఇప్పించాలని నిర్ణయించారు. బైక్ షోరూంలో డౌన్ పేమెంట్ చెల్లించి.. జే హాల్దేకు కొత్త బైక్ కొనిచ్చారు. బండి డౌన్ పేమెంట్ కడితే చాలని, ఈఎంఐలు తానే కట్టుకుంటానని పోలీసులకు చెప్పినట్లు హాల్దే వివరించాడు. గతంలో తాను సైకిల్ మీద 6 నుంచి 8 డెలివరీలు చేసేవాడినని.. ఇప్పుడు బైక్ మీద రాత్రి పూట 15 నుంచి 20 డెలివరీలు చేస్తున్నానని హాల్దే చెప్పుకొచ్చాడు.