వడ్డీల దందాపై కొరడా .. సీపీ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

వడ్డీల దందాపై కొరడా .. సీపీ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
  • నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారులపై రైడ్స్  
  • ఓ వ్యాపారి ఇంట్లో దొరికిన రూ.85 లక్షల క్యాష్ 
  • రూ. కోట్ల విలువైన  స్థిరాస్తి పత్రాలు స్వాధీనం
  • మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద 30 మందిపై కేసులు
  • బిత్తరపోయిన వ్యాపారులు.. కలెక్షన్లు స్టాప్

నిజామాబాద్, వెలుగు: వడ్డీ వ్యాపారుల ఇండ్లు, ఆఫీస్​లపై దాడులు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపాయి. ప్రజల ఆర్థిక అవసరాలను అవకాశంగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారుల కట్టడికి ఫస్ట్ టైమ్ పోలీసుల రైడ్స్ తో నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కినవారు ఎలా దగాపడుతున్నా రో తెలిసేలా లభ్యమైన1,435 బ్లాంక్ ప్రామిసరీ నోట్లు, 43 సేల్ డీడ్ డాక్యుమెంట్లు, 30 బాండ్ పేపర్లు నిరూపించాయి. రూ.85 లక్షల నగదుతో పాటు డాక్యుమెంట్లను పోలీసులు జప్తు చేసి కోర్టులో డిపాజిట్ చేసి.. మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద 30 మంది వ్యాపారులపై కేసులు ఫైల్ చేశారు. ఈనెల 17,18 తేదీల్లో రెండు రోజులు సుమారు 90 మంది వడ్డీ వ్యాపారుల ఇండ్లు, ఆఫీస్​లపై పోలీసులు రైడ్స్​నిర్వహించారు. 

ముందుగానే వివరాల సేకరణ

జిల్లాలో రిజిస్ట్రర్డ్ చిట్​ఫండ్​ఫైనాన్స్​కంపెనీలు 24 ఉంటే.. అనుమతులు లేనివి వందల్లో ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్​తోపాటు 3 మున్సిపాలిటీలే కాకుండా జిల్లా అంతటా గ్రామాల్లోనూ వడ్డీ వ్యాపారుల దందా ఇష్టానుసారంగా నడుస్తుంది. అప్పుల కోసం వచ్చేవారి అవసరాన్ని బట్టి నెలకు వందకు రూ.2 నుంచి రూ.20 దాకా వడ్డీ వసూలు చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ, పెండ్లి, ఉపాధికి గల్ఫ్ కు వెళ్లేవారి నుంచి అధిక వడ్డీలు తీసుకుంటున్నారు. రూ.2 లక్షలు అప్పు చేస్తే.. ఎంతకూ తీరకపోగా నిజామాబాద్​కు చెందిన వేణు, అనురాధ దంపతులతో పాటు కూతురు పూర్ణిమ గతేడాది బాసర వద్ద గోదావరిలో దూకి సూసైడ్  చేసుకున్న విషయం తెలిసిందే. 

అనురాధ చావు నుంచి తప్పించుకుని ఒంటరిగా మిగిలారు. అదేవిధంగా ఇందల్వాయి మండలం తిర్మన్​పల్లికి చెందిన లక్ష్మి, అర్గుల్​గ్రామానికి చెందిన కుంట రమేశ్ అప్పులోళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.  ఇలా రోజూ జిల్లాలో ఏదో ఒకచోట వడ్డీ వ్యాపారుల బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధితులు సీపీ సాయి చైతన్య దృష్టికి తీసుకెళ్లగా పకడ్బందీ ప్లాన్​తో రైడ్స్​ చేయించారు. అంతకుముందే జిల్లాలో పోలీస్​స్టేషన్​వారీగా వడ్డీ వ్యాపారుల వివరాలు తీసుకున్నారు.  

భయాందోళనలో వ్యాపారులు 

ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున పోలీస్​ రైడ్స్​చేయడంతో వడ్డీ వ్యాపారులు బిత్తరపోయారు. మరిన్ని దాడులు జరగనున్నాయనే ప్రచారంలో ఉండగా దందా చేస్తున్నవారు భయపడుతున్నారు.  దీంతో దొరుకుతామని అప్పులు ఇవ్వడం, వడ్డీ కలెక్షన్స్ చేయడం ​ఆపేశారు. సీజ్​చేసిన క్యాష్​, ఇతర విలువైన పత్రాలు రిలీజ్​ చేయించుకునేందుకు వ్యాపారుల పైరవీలు చేస్తుండగా.. ఈ విషయం కోర్టుకు చేరడంతో టెన్షన్ లో పడిపోయారు. 

ప్రామిసరీ నోట్ల నుంచి బ్లాంక్ చెక్కుల దాకా..

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్​డివిజన్లలో చేసిన రైడ్స్​లో రూ.85 లక్షల క్యాష్​లభ్యమైంది. 1,435 ప్రామిసరీ నోట్లు, బాండ్​పేపర్స్​రాసిన 30 అప్పు అగ్రిమెంట్లు, కుదువపెట్టిన 30 స్థిరాస్తి డాక్యుమెంట్లు, 31 బ్లాంక్​ చెక్కులు, మూడు వాహనాలు, భూముల పట్టాదారు పాస్​బుక్స్​దొరికాయి. కేవలం సంతకాలు మాత్రమే ఉన్న బ్లాంక్​ చెక్కులు, ప్రామిసరీ నోట్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దాదాపు 90 చోట్ల దాడులు చేసి ఎక్కువ నగదు, పత్రాలు దొరికిన 30 మందిపై మనీ లాండరింగ్​ కేసులు పెట్టారు. ఇక వారు సరైన ఆధారాల తో కోర్టుకు వెళ్లి క్యాష్​తో పాటు పోలీసులు తమ నుంచి జప్తు చేసుకున్న బ్లాంక్​ప్రామిసరీ నోట్స్, చెక్స్ ఇతర స్థిరాస్తి పత్రాలు రిలీజ్​చేసుకోవాల్సి ఉంటుంది.