TMC నేత పొలంలో నోట్ల కట్టలు.. 2.24 కోట్లు స్వాధీనం

TMC నేత పొలంలో నోట్ల కట్టలు.. 2.24 కోట్లు స్వాధీనం

బెంగాల్లో టీఎంసీ నేత ఇంటి సమీపంలోని పొలంలో పాతిపెట్టిన నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఇప్పటివరకు రూ.2.24 కోట్ల నగదు, కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ పార్టీ నేత దీపాంకర్​ను అరెస్టు చేశారు.

బదురియా: బెంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత ఇంటి సమీపంలోని పొలంలో పాతిపెట్టిన నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఇప్పటివరకు రూ.2.24 కోట్ల నగదుతో పాటు కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ పార్టీ నేత, బదురియా మున్సిపాలిటీ చైర్‌‌పర్సన్ దీపాంకర్ భట్టాచార్యను అరెస్టు చేశారు.

ఈ నెల 24న అర్ధరాత్రి బెంగాల్‌‌లోని బదురియా ప్రాంతంలో గల టీఎంసీ కార్యాలయం నుంచి వ్యాన్లలో కొన్ని వస్తువులను తరలించడాన్ని చూసిన స్థానికులు.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు టీఎంసీ కార్యాలయానికి రాగా.. వారిని చూసి భట్టాచార్య, అతని అనుచరులు పరారయ్యారు.

సోమవారం భట్టాచార్యపై బీజేపీ అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయి విచారణ ప్రారంభమైంది. మంగళవారం భట్టాచార్యను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు కస్టడీకి అనుమతించింది. విచారణ సమయంలో తన ఇంటి వెనుక ఉన్న జనపనార పొలంలో నగదు పాతిపెట్టినట్టు భట్టాచార్య అంగీకరించాడు.

దీంతో పోలీసులు గంటల తరబడి తవ్వకాలు జరపగా.. ట్రాలీ బ్యాగులు, బస్తాల్లో గట్టిగా ప్యాక్ చేసిన రూ. 500 నోట్ల కట్టలు, బంగారం లభ్యమయ్యాయి. బుధవారం రాత్రంతా లెక్కించిన తర్వాత ఆ మొత్తం రూ.2.24 కోట్లుగా తేలింది. ఈ మొత్తం రూ. 3 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భట్టాచార్య నివాసానికి ఆనుకుని ఉన్న ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో కూడా కొన్ని నగదు బస్తాలు లభ్యమయ్యాయి. 

ఆ కేంద్రాన్ని భట్టాచార్యనే నడుపుతున్నట్టు స్థానికులు తెలిపారు. అలాగే, పోలీసులు టీఎంసీ పార్టీ ఆఫీస్, ఫామ్‌‌హౌస్‌‌లో సోదాలు నిర్వహించగా.. సుమారు 4 వేల టార్పాలిన్ షీట్లు లభ్యమయ్యాయి. అదే విధంగా చైర్‌‌పర్సన్ ఫామ్‌‌హౌస్‌‌లో దాదాపు రూ. 80 లక్షల నగదు కూడా దొరికినట్టు స్థానిక మీడియా నివేదించింది.