
బెయిల్ ఇప్పిస్తామని మోసం చేసిన వ్యవహారంలో..
అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు
జగిత్యాల, వెలుగు: సూసైడ్ కేసులో అరెస్టయిన నిందితుడికి బెయిల్ ఇప్పిస్తామని నమ్మించిన ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లు రూ.1.10 లక్షలు తీసుకున్నారు. తీరా బెయిల్ ఇప్పించకపోవడంతో బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. పదిరోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలివి.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో మూడు నెలల క్రితం జక్కుల సమత (20) సూసైడ్ చేసుకుంది. సమత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సమత భర్త జక్కుల మహేశ్తో పాటు అత్తమామలపై కేసు నమోదు చేశారు.
కాగా, ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు కొత్తపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్‌వీ కో ఆర్డినేటర్ రామడుగు రాజేశ్, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు సతీష్, మాజీ సర్పంచ్ భర్త రవి కలిసి తన నుంచి రూ.1.10 లక్షలు తీసుకున్నారని మహేశ్తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేశ్ అదనంగా రూ.6 లక్షలు అడగడంతో తాను వేరే అడ్వకేట్‌ను మాట్లాడుకుని రెండు వారాల క్రితం బెయిల్పై వచ్చానని చెప్పాడు. కాగా, ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లపై ఈ నెల 18న కేసు నమోదైనా ఇంకా అరెస్టు చేయలేడం లేదని వాపోయాడు. అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నాడు.