విద్యుత్ శాఖ సిబ్బందిని పోలీసులు ఆపొద్దు

విద్యుత్ శాఖ సిబ్బందిని పోలీసులు ఆపొద్దు

నల్గొండ జిల్లా: తెలంగాణ‌ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో నల్గొండలో పోలీసులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డెక్కినవారిపై లాఠీ విరిగింది. సమాధానం చెప్పేలోపే భాదితులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. శ‌నివారం విద్యుత్ అధికారులు, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లను కూడా పోలీసులు వ‌ద‌ల‌లేదు. పోలీసుల వైఖరితో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో  శ‌నివారం ప‌లుచోట్ల‌ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


డ్యూటీలకు వెళ్తుంటే ఎక్కడకు అంటూ త‌మ‌పై పోలీసులు దాడులు చేయ‌డం దారుణ‌మ‌న్నారు విద్యుత్ సిబ్బంది. దాడికి నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేశామ‌న్నారు. హైదరాబాద్ లోనూ విద్యుత్ అధికారులు, సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించార‌న్నారు. హాస్పిటల్, ఇండ్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే మాపై ఇలా ఆంక్షలు ఏంటని ప్ర‌శ్నించారు. మేము విధులకు దూరంగా ఉంటే రాష్ట్రం అంధకారమ‌వుతుందని హెచ్చరించారు. మాకు లాక్ డౌన్ రూల్స్ నుండి మినహాయింపు ఉన్నా.. దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. విష‌యం తెలుసుకున్న మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.. డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. విద్యుత్ శాఖ సిబ్బందిని ఆపొద్దని కోరినట్లు తెలిపారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.