‘ఆపరేషన్’ సక్సెస్' .. ఆపరేషన్ ముస్కాన్లో 328 మంది చిన్నారులకు విముక్తి

‘ఆపరేషన్’ సక్సెస్' .. ఆపరేషన్ ముస్కాన్లో 328 మంది చిన్నారులకు విముక్తి
  • ప్రత్యేక టీమ్​లతో తనిఖీలు
  • పేరెంట్స్​కు కౌన్సెలింగ్.. స్కూళ్లకు పిల్లలు
  • ప్రభుత్వ శాఖల సమన్వయంతో సత్ఫలితాలు

ఆసిఫాబాద్, వెలుగు: బాల కార్మికుల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పేదరికం, పరిస్థితుల కారణంగా పసి వయసులో చదువుకు దూరమై వెట్టి చాకిరీ చేస్తున్న పిల్లలను కాపాడి వారికి విముక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యింది. 18 ఏండ్లు నిండకుండానే పిల్లలు పలు కారణాలతో ఇటుక బట్టీలు, హోటళ్లు, కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. పిల్లలకు చాకిరీ నుంచి విముక్తి కలిగించేందుదుకు ప్రతీ ఏటా జులైలో చేపట్టే ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చింది. నెలరోజుల్లో ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 328 మంది పిల్లలకు పోలీసులు విముక్తి కలిగించారు. వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చి, మరికొందరిని బడికి పంపేలా కుటుంబీకులకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న షాపుల నిర్వాహకులు, ఇతరుల మీద కేసులు నమోదు  చేసి మళ్లీ పనిలో పెట్టుకోకుండా కౌన్సిలింగ్ నిర్వహించారు. 

సంయుక్త ఆపరేషన్

ఆర్థిక ఇబ్బందులు, అవగాహన రాహిత్యం తదితర కారణాలతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. గతంలో కార్మిక శాఖ ఆఫీసర్లు మొక్కుబడిగా దాడులు చేస్తుండటంతో కొంతకాలం ఫలితం లేకపోయింది. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ వారీగా లేబర్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో పోలీసులు టీమ్​గా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ బాల కార్మికులకు విముక్తి కలిగిస్తున్నారు. 

పనిలో పెట్టుకున్నవారిపై కేసులు

జులైలో చేపట్టిన ఆపరేషన్ ​ముస్కాన్​లో నెల రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, పరిశ్రమలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అక్కడ పనిచేస్తున్న వారిని రక్షించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 328 మందికి విముక్తి కలిగించారు. మంచిర్యాల జిల్లాలో 122 మంది (బాలురు 84, బాలికలు 38), ఆదిలాబాద్​93 మంది, నిర్మల్​లో 65 మంది (బాలురు 59, బాలికలు 6), ఆసిఫాబాద్​జిల్లాలో 48 (బాలురు 47, ఒక బాలిక) మందిని కాపాడారు. పనిలో పెట్టుకున్న వారికి, పేరెంట్స్​కు కౌన్సిలింగ్ ఇచ్చి, పలువురిపై కేసులు నమోదు చేశారు. మరికొందరిని స్కూళ్లకు పంపించారు. 

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చర్యలు

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ ను సక్సెస్ చేశాం. 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశాం. బాల కార్మిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాల కార్మికుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.

కాంతిలాల్ పాటిల్, ఎస్పీ, ఆసిఫాబాద్