కార్లు రెంటుకు తీస్కుంటరు.. వేరేటోళ్లకు అమ్ముకుంటరు

కార్లు రెంటుకు తీస్కుంటరు.. వేరేటోళ్లకు అమ్ముకుంటరు
  •    రెగ్యులర్​గా రెంట్ ​కడుతూ అనుమానం  రాకుండా జాగ్రత్తలు 
  •     ఎట్టకేలకు చిక్కిన ముగ్గురు స్టూడెంట్స్​ 
  •     పరారీలో ప్రధాన నిందితుడు..
  •     మాదాపూర్​పీఎస్​పరిధిలో ఘటన 

మాదాపూర్​, వెలుగు : ఆ నలుగురు యువకులు స్టూడెంట్స్. అందరిదీ ఒకే ఊరు. విలాసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం పక్కదారి పట్టారు. కార్లను రెంట్​కు తీసుకొని అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని తక్కువ ధరకు అమ్మేసి వచ్చిన డబ్బులతో ఎంజాయ్​చేస్తున్నారు. గతంలో రెంట్​కు తీసుకున్న కార్లను తిరిగి ఇవ్వకుండా రెంట్​కడుతూనే మరో కారు కావాలని వెళ్లగా అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు కంప్లయింట్​ఇచ్చారు. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్​చేశారు. సుమారు రూ.కోటి విలువ చేసే ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు వివరాలను హైదరాబాద్​లోని మాదాపూర్​జోన్​ఏసీపీ శ్రీకాంత్​ బుధవారం వెల్లడించారు. రామగుండం ప్రాంతానికి చెందిన హరీశ్, అభిషేక్, కొమలేశ్వర్, ప్రేమ్​కుమార్ ఫ్రెండ్స్. అందరూ డిగ్రీ, ఎంబీఏ చదువుతున్నారు. విలాసాలకు అలవాటు పడ్డ వీరు ఈజీ మనీ కోసం కార్లను రెంట్​కు తీసుకొని అమ్మేయాలని ప్లాన్​వేసుకున్నారు. గతంలో హరీశ్​మాదాపూర్​లోని లాంగ్ డ్రైవ్​కార్స్​లో కార్లను రెంట్​కు తీసుకునేవాడు. ఒకసారి ఓ కారును తీసుకుని టైంకు ఇవ్వకపోవడంతో హరీశ్​కార్డును బ్లాక్​ చేశారు. దీంతో  ఫ్రెండ్స్​అయిన అభిషేక్​, కోతమలేశ్వర్​రావు, ప్రేమ్​కుమార్​లను కార్లు రెంట్​కు తీసుకోవాలని లాంగ్ డ్రైవ్​కార్స్ అఫీస్​కు పంపించేవాడు. వీరంతా అభిషేక్​ఐడీ ప్రూఫ్​తో కార్లను బుక్​ చేసేవారు. తీసుకున్న కార్లను హరీశ్​కు ఇచ్చేవారు. దీంతో హరీశ్​ ఆ కార్లను అదిలాబాద్​కు తీసుకువెళ్లి గుర్తు తెలియని వ్యక్తులకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకునేవాడు. వచ్చిన డబ్బుల్లో అభిషేక్​, కొమలేశ్వర్​రావు, ప్రేమ్​కుమార్​లకు రూ.35వేల నుంచి 50వేల వరకు కమిషన్​ఇచ్చేవాడు. పదిరోజుల వ్యవధిలో ఒక్కో కారు తీసుకుంటూ రెండు నెలల్లో ఐదు కార్లు తీసుకున్నారు.

అయితే, తీసుకున్న కారు రేంజ్​ను బట్టి రూ.1000 నుంచి 6వేల వరకు రెంట్​పక్కాగా కట్టేవారు. దీంతోపాటు జీపీఎస్​లో కూడా కార్లు తిరుగుతున్నట్టు కనిపిస్తుండడంతో యాజమాన్యానికి అనుమానం రాలేదు. మార్చి 23న అభిషేక్​ మళ్లీ తన ఐడీ ప్రూఫ్​పెట్టి మహీంద్రా థార్​ కారు బుక్​ చేసుకున్నాడు. ఐడీ చెక్​చేస్తుండగా ఇప్పటివరకు ఐదు కార్లు అభిషేక్​ పేరుతోనే తీసుకోవడం, ఒక్క కారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అభిషేక్​, కోమలేశ్వర్​, ప్రేమ్​కుమార్​ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. వీరి నుంచి రూ.కోటి విలువైన రెండు మహీంద్రా థార్​లు, మారుతి ఎర్టిగా, ఇకోస్పోర్ట్స్​, హుందాయ్​ క్రెటా కార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హరీశ్​పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.మాదాపూర్​సీఐ మల్లేశ్​, ఎస్​ఐ వెంకట్​ పాల్గొన్నారు.