బిజినెస్ నడవాలంటే ఈటలకు సపోర్ట్ చేయొద్దని బెదిరింపు

బిజినెస్ నడవాలంటే  ఈటలకు సపోర్ట్ చేయొద్దని బెదిరింపు

ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే హుజురాబాద్‌లో వాతావరణం రాజకీయంగా వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే తనకోసం పనిచేస్తున్న కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన గెలుపును అడ్డుకోలేరని ఆయన అన్నారు. 

‘చాలామంది కార్యకర్తలు, విద్యార్థులు నా కోసం నిద్రపోకుండా పనిచేస్తున్నారు. కొన్ని వందల మంది ఇంటెలిజెన్స్, ఇతర పోలీసులను హుజురాబాద్‌లోకి దించారు. బీజేపీలో తిరుగుతున్న వారిని పిలిచి అనేక రకాల ప్రశ్నలు వేస్తూ పోలీసులు వేధిస్తున్నారు. బిజినెస్ చేసుకునే వారిని పిలిచి.. మీ బిజినెస్ నడవాలంటే బీజేపీకి సపోర్ట్ చేయోద్దని బెదిరిస్తున్నారు. నాకు ఓటేస్తే పథకాలు అందవని చెబుతున్నారు. పథకాలు ఏమైనా మీ తాతా జాగీరా? దొంగ ఓట్లకు దరఖాస్తు చేస్తున్నారు. దొంగపనులకు, చట్టవ్యతిరేక చర్యలకు ఒడిగడుతున్న అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా’ అని ఈటల అన్నారు.