పాట్నా: అత్యంత విలువైన, అరుదైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియంను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.850 కోట్ల విలువైన 50 గ్రాముల కాలిఫోర్నియంను అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు. కాలిఫోర్నియంను గుజరాత్ నుంచి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన చెప్పారు. ‘‘కాలిఫోర్నియం అక్రమ రవాణాపై మాకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించాం.
వాళ్లు బిహార్–ఉత్తరప్రదేశ్ బార్డర్లోని బల్థారి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న ముగ్గురిని చెక్ చేయగా 50 గ్రాముల కాలిఫోర్నియం దొరికింది. నిందితులను అరెస్టు చేశాం” అని ఎస్పీ తెలిపారు. నిందితులను చోటే లాల్ ప్రసాద్, చందన్ గుప్తా, చందన్ రామ్ గా గుర్తించామని చెప్పారు. ‘‘కాలిఫోర్నియం విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ లో గ్రాముకు రూ.17 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన మేం పట్టుకున్న 50 గ్రాముల విలువ రూ.850 కోట్లు ఉంటుంది” అని వెల్లడించారు. దీన్ని అమ్మేందుకు నిందితులు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారని, వాళ్ల దగ్గర దాని టెస్ట్ రిపోర్టు కూడా ఉందని పేర్కొన్నారు.
