మంత్రిని ప్రశ్నించిన రైతును బయటకు పంపించిన పోలీసులు

మంత్రిని ప్రశ్నించిన రైతును బయటకు పంపించిన పోలీసులు
  • రుణమాఫీపై మంత్రి ఎర్రబెల్లి నిలదీత
  • రైతును బయటకు పంపించిన పోలీసులు

మెట్‌పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రుణమాఫీపై స్థానిక రైతు సామ గంగారెడ్డి నిలదీశారు. మంగళవారం మెట్లచిట్టాపూర్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి సమావేశానికి మంత్రి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందజేస్తోందని చెబుతుండగా,  గంగారెడ్డి అడ్డు తగిలారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వమే అయితే ఇప్పటివరకు పంట రుణమాఫీ  ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దీంతో  స్టేజీపైకి వచ్చి మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి రైతు గంగారెడ్డికి సూచించారు. స్టేజీ పైకి వచ్చిన గంగారెడ్డి పంట రుణమాఫీ గురించి మాట్లాడుతుండగా, ‘నీది ఏ పార్టీ’ అని మంత్రి ప్రశ్నించారు. తాను బీజేపీ కార్యకర్తను అని గంగారెడ్డి బదులివ్వగానే అక్కడే ఉన్న పోలీసులు గంగారెడ్డిని సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గడంతో రైతు రుణమాఫీ జాప్యం అవుతోందని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు.