
- గతంలో ఎస్‌ఐ నుంచి డీసీపీ దాకా సిఫార్స్ పోస్టింగ్‌లే
- ఇప్పుడు రాజకీయ జోక్యం లేకుండా పోలీసులకు పవర్స్
- డీజీపీ రవిగుప్తా యాక్షన్ ప్లాన్
హైదరాబాద్, వెలుగు : పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతున్నది. ఎలాంటి సిఫార్సులు, పైరవీలకు తావులేకుండా అర్హులైన వారికి మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో డీజీపీ రవిగుప్తా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దీంతో డిపార్ట్‌మెంట్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా డీజీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా భూ కబ్జాలు, డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళలకు రక్షణపై వంటి అంశాలపై ఆయన దృష్టి పెట్టారు.
బీఆర్‌ఎస్ నాయకుల పోలీసింగ్
బీఆర్ఎస్ హయాంలో ప్రజాసేవకు కాకుండా మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే కొందరు పోలీసులు సర్వీస్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నేతలు తమకు అనుకూలమైన వారికి అవసరమైన చోట పోస్టింగ్ ఇప్పించేవారు. ఎలాంటి పైరవీలు లేని వారిని లూప్‌లైన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించేవారు. ఇందుకోసం సీఎంవో, మంత్రులు, ఎమ్మెల్యే స్థాయిలో సిఫార్సు లెటర్లు, పైరవీలు జరిగేవి. ఇలాంటి రాజకీయ పలుకుబడితో పోస్టింగ్స్ తెచ్చుకున్న కొందరు పోలీసు అధికారులు బీఆర్‌ఎస్ లీడర్లకు అనుకూలంగా పనిచేసేవారు. సివిల్, క్రిమినల్ కేసులతో పాటు స్థానికంగా జరిగే చిన్నచిన్న వివాదాల్లోనూ లోకల్ లీడర్లు చెప్పిన సెక్షన్లతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికార పార్టీ నేతలతో కలిసి అక్రమాలు
సిటీ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, సివిల్ వివాదాల్లో రాజకీయ నాయకులతో కలిసి కొందరు పోలీసులు సెటిల్‌మెంట్స్ చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల్లో పోలీసులు తలదూర్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అమాయకుల భూములను కబ్జా చేసిన నేతలకే సెక్యూరిటీ కల్పిస్తూ.. బాధితులపైనే కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ లీడర్ల అండదండలు ఉన్న అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. బాధితులకు అన్యాయం చేశారనే విమర్శలు వచ్చాయి. బీఆర్‌ఎస్ నేతల సిఫార్సులతో పోస్టింగ్ పొందిన కొందరు ఇన్‌స్పెక్టర్లు.. డీసీపీ స్థాయి అధికారులపై కూడా ఆధిపత్య ధోరణి ప్రవర్తించే వారని డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరిగేది.
రాచకొండ, సైబరాబాద్‌లో మంత్రుల మార్క్
రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఎన్నో సివిల్ వివాదాలు చోటుచేసుకున్నాయి. వందల కోట్లు విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. రాచకొండ కమిషనరేట్‌లోని ఓ మాజీ మంత్రి.. ఏసీపీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ స్థాయి అధికారి వరకు తమ సామాజికవర్గం వారికే పోస్టింగ్స్ ఇప్పించారనేది బహిరంగ రహస్యమే. ఎల్బీనగర్, వనస్థలిపురం ఏసీపీ పోస్టింగుల విషయంలో గంటల్లోనే జీవోలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రక్షాళన దిశగా పోలీస్ వ్యవస్థ
ప్రభుత్వం మారిన వెంటనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో భారీ మార్పులు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు జిల్లా ఎస్పీలు, సీపీల బదిలీ జరిగింది. గత ప్రభుత్వంలో వివక్షకు గురై ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉన్న ఐపీఎస్‌లను ప్రజలకు సర్వీస్ చేసేలా పోస్టింగ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే మరికొంత మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు లేని అధికారులను పరిగణలోకి తీసుకుంది. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోనుంది. విధి నిర్వహణలో నిబద్దత, స్కిల్, ట్రైనింగ్‌లో మెరిట్ ఆధారితంగా అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నది.