- ముగ్గురు నిందితులు అరెస్ట్.. రిమాండ్
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద అందరూ చూస్తుండగా ఓ రౌడీషీటర్‌ను మరో రౌడీషీటర్ హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్ ఇన్చార్జి డీసీపీ కోటిరెడ్డి గురువారం మీడియాకు వివరించారు.
జగద్గిరిగుట్టకు చెందిన తానుగుండ్ల బాలశౌరెడ్డి అలియాస్ బాద్షా(21), ఐడీపీఎల్ రంగారెడ్డినగర్‌కు చెందిన రోషన్కుమార్సింగ్ అలియాస్ రోషన్(22) ఇద్దరూ రౌడీషీటర్లు. వీరిద్దరూ పాత మిత్రులు. అమ్మాయిలతో అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల్లో ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి.
బాలశౌరెడ్డికి షరీఫ్ అనే వ్యక్తితో శత్రుత్వం ఉంది. షరీఫ్ విషయంలో జోక్యం చేసుకుంటే చంపేస్తానని రోషన్.. బాలశౌరెడ్డిని బెదించాడు. దీంతో తనను బెదిరించిన రోషన్‌నే చంపేస్తే ఏ సమస్య ఉండబోదని బాలశౌరెడ్డి నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం తన మిత్రులైన జగద్గిరిగుట్టకు చెందిన సయ్యిద్మహ్మద్(28), రేవో ఆదిత్య అలియాస్ ఆది సాయం కోరగా, వారు అంగీకరించారు. ప్లాన్ ప్రకారం బాలశౌరెడ్డి అమేజాన్‌లో కత్తి కొన్నాడు.
ముగ్గురు కలిసి రోషన్‌ను బుధవారం మధ్యాహ్నం జగద్గిరిగుట్ట బస్టాప్‌కు పిలిపించారు. అక్కడికి రోషన్ వచ్చాక బాలశౌరెడ్డి మాటలు కలిపాడు. ఈ క్రమంలో బాలశౌరెడ్డితో వచ్చిన ఇద్దరు మిత్రుల్లో ఒకరు రోషన్‌ను పట్టుకోగా, మరొకరు బైక్‌పై సిద్ధంగా ఉన్నారు. బాలశౌరెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రోషన్‌ను పొడిచాడు. ఆ తరువాత ముగ్గురు కలిసి బైక్‌పై పారిపోయారు. రోషన్ గాంధీలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు గురువారం నిందితులు బాలశౌరెడ్డి, సయ్యిద్ మహ్మద్, అదిత్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
