నాగోల్ మహదేవ్ జ్యువెల్లరీస్‌ కేసును ఛేదించిన పోలీసులు

నాగోల్ మహదేవ్ జ్యువెల్లరీస్‌ కేసును ఛేదించిన పోలీసులు

నాగోల్ మహదేవ్ జ్యువెల్లరీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను రాచకొండ పోలీసులు ఛేదించారు. అందులో భాగంగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో 10 మందిని చేర్చడంతో పాటు..ఆరుగురిని అరెస్ట్ చేశారు.   మరో నలుగురు పరారీలో ఉన్నారని.. అందులో ఒకరు కీలక నిందితుడు మహేందర్ అని పోలీసులు వెల్లడించారు.  ఈ నేపథ్యంలో రూ.లక్షా35వేల900 విలువ గల 2701.8 గ్రాముల బంగారం, రూ.65,500  క్యాష్, 6 మొబైల్స్,3 కంట్రీ మేడ్ పిస్టల్, 1 ఎయిర్ పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో పాటు హోండా యాక్టివా, పల్సర్ కంపెనీలకు చెందిన 4 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామన్నారు.

మొదట సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా దర్యాప్తు చేశాం

డిసెంబర్ 1న 8:30 సమయంలో చైతన్య పురి పొలీస్ స్టేషన్ పరిధిలో మహేదేవ్ జ్యూవెల్లరీ వద్ద ఇద్దరిపై గన్ ఫైర్ చేసి చోరీ జరిగిందనే  సమాచారం అందిందని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకొని ఎస్వోటీ, సీసీఎస్, క్రైమ్ టీంలను ఫార్మ్ చేశామని, గాయాలైన సుఖ్ దేవ్, సుఖ్ రామ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు. మొదట సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా దర్యాప్తు చేశామన్న సీపీ.. ముసుగు ధరించి బైక్ పై వచ్చిన నలుగురు గణపతి జ్యువెలరీ నుండి తెచ్చిన గోల్డ్ బ్యాగ్ ఇవ్వాలని అడిగారని, వారు ఇవ్వకపోవడంతో కాల్పులు జరిపి గోల్డ్ తో పరార్ అయ్యారని తెలిపారు. ఒక్కొక్క సీసీ టీవీ కెమెరాలతో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వెళ్ళామన్న సీపీ మహేష్ భగవత్..  నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ ను గుర్తించామని, దర్యాప్తులో భాగంగా మరో స్కూటీకి సంబంధించిన చిన్న క్లూ దొరికిందన్నారు. దాని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసి ఆరుగురిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. అఫెన్స్ తర్వాత వారు పరార్ అవ్వడానికి వాడిన మహేంద్ర వెహికల్ తో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజస్థాన్ కు చెందిన ప్రధాన సూత్రధారి మహేంద్ర చౌదరి గతంలో గుజరాత్ లో గోల్డ్ షాఫ్ పెట్టాడని, నాలుగేళ్ల క్రితం గజ్వేల్ కు షిప్ట్ అయ్యి జ్యూవెల్లరీ షాపు పెట్టాడని తెలిపారు. ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసి చోరీ చేపించింది మహేంద్ర చౌదరీనేనని స్పష్టం చేశారు. దోపిడీ జరుగుతున్న సమయంలో మహేంద్ర చౌదరి ఉప్పల్ లోని ఓ బార్ లో ఉన్నాడని సీపీ వివరించారు.