సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ ను ..అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేయాలి

సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ ను ..అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేయాలి

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో సైబర్‌‌ క్రైమ్, డ్రగ్స్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు హోంమంత్రి మహమూద్‌‌ అలీ కోరారు. యువత డ్రగ్స్‌‌కు బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండింటిని కంట్రోల్‌‌ చేసేందుకు రాష్ట్ర పోలీసులు మరింత కృషి చేయాలని సూచించారు. మంగళవారం ఆయన, మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌తో కలిసి బంజారాహిల్స్‌‌లోని కమాండ్ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌లో యాంటీ నార్కొటిక్స్‌‌, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరోలను ప్రారంభించారు. 

టవర్‌‌‌‌ 'బి'లోని 2,3 ఫ్లోర్స్‌‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో,13వ ఫ్లోర్‌‌‌‌లో యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో ఆఫీసులను పరిశీలించారు. డీజీపీ అంజనీకుమార్‌‌‌‌, రెండు బ్యూరోల చీఫ్‌‌లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రతో కలిసి ల్యాబ్‌‌లు, పరికరాలు పనిచేసే విధానం గురించి తెలుసుకున్నారు. అనంతరం మహమూద్‌‌ అలీ మాట్లాడుతూ.. సాధారణ నేరాల కంటే సైబర్ క్రైమ్, డ్రగ్స్‌‌ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటిని నివారించేందుకు రెండు బ్యూరోలు సమర్ధంగా పనిచేయాలని ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని..యువత రకరకాల డ్రగ్స్‌‌కు బానిస అవుతోందని వెల్లడించారు. సీ– పోర్ట్‌‌లు, ఎయిర్ పోర్టుల ద్వారా  డ్రగ్స్ దేశంలోకి వస్తోందని తెలిపారు. 

డ్రగ్స్‌‌ను అరికట్టాలంటే పటిష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. దేశమంతా తెలంగాణ పోలీసులను ఆదర్శంగా తీసుకుంటున్నదని అన్నారు. సైబర్‌‌ ‌‌క్రైమ్, డ్రగ్స్‌‌ కేసులను సవాలుగా  తీసుకోవాలని కోరారు. యాంటీ నార్కోటిక్స్, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరోలు ఇతర రాష్ట్రాల పోలీసులు,సెంట్రల్ ఎజెన్సీస్‌‌తో కో ఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. ఈ రెండు బ్యూరోలు మరో ల్యాండ్‌‌ మార్క్‌‌గా నిలుస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఎలాంటి నేరం జరిగినా నిందితులను వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని డీజీపీ ఆదేశించారు.