
ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని చంచల్ గూడ జైలు నుండి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కస్టడీలో భాగంగా రామచంద్ర భారతి, నంద కుమార్, సింహాయాజీ లను రెండు రోజుల పాటు పోలీసులు విచారించునున్నారు. అనంతరం వారి స్టేట్ మెంట్ నమోదు చేయనున్నారు. ఈ క్రమంలోనే నకిలీ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, వంద కోట్ల డీల్ పై వివరాలు సేకరించనున్నారు. మరోవైపు సిట్ బృందం సైతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. అంతకు మునుపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీని పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఈ ముగ్గురు నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో వారిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు పెట్టారని, ఎక్కడ కూడా డబ్బులు లభించలేదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.