తనిఖీలతో తక్లీఫ్​..చెకింగ్స్‌‌ పేరుతో జనంపై పడుతున్న పోలీసులు

తనిఖీలతో తక్లీఫ్​..చెకింగ్స్‌‌ పేరుతో జనంపై పడుతున్న పోలీసులు
  • పండుగలకు తీసుకెళ్తున్న బంగారు నగలను సీజ్ చేస్తున్నరు
  • భూమి అమ్మినా.. కొన్నా.. నగదు పట్టుబడితే స్వాధీనమే
  • రోజువారీ బిజినెస్ చేసుకునేటోళ్ల డబ్బునూ వదుల్తలే
  • కొన్నింటికి ఆధారాలు చూపినా పట్టించుకుంటలే
  • వైన్స్ ఓనర్లకు పెద్ద దెబ్బ.. 50కి పైగా లిక్కర్ షాపుల సేల్స్ సొమ్ము స్వాధీనం
  • ఇప్పటి వరకు రూ.109 కోట్లు సీజ్.. 70 శాతం సామాన్యులవేనంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు : ఎలక్షన్ కోడ్ పేరుతో రాష్ట్రంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు, టాస్క్​ఫోర్స్, ఇతర ఆఫీసర్లు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. భూమి కోసమో, సొంతింటి కోసమో, ఇంకేదైనా అవసరం కోసమో డబ్బులు తీసుకెళ్తే.. స్వాధీనం చేసుకుంటున్నారు. పండుగ పూట వేసుకుందామని ఇంట్లో నుంచి బంగారాన్ని బ్యాగులో తీసుకెళ్లినా సీజ్ చేస్తున్నారు. రెగ్యులర్ బిజినెస్ నడుపుకునే వ్యాపారులు షాప్ మూసివేసిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్తుంటే జప్తు చేస్తున్నారు. వైన్ షాపుల ఓనర్లకూ ఈ ఇక్కట్లు తప్పడం లేదు. రాత్రిపూట వైన్స్ బంద్ చేసి నగదును ఇంటికి తీసుకెళ్లే టైంలో టాస్క్​ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్​ఓటీ) అధికారులు డబ్బును సీజ్ చేస్తున్నారు.

కిలోమీటర్‌‌కు ఒక చెక్‌‌పోస్టు, వీధికో చెకింగ్ పాయింట్ అన్నట్టుగా భారీ ఎత్తున యంత్రాంగాన్ని మోహరించారు. ఈ తనిఖీల్లో సామాన్య ప్రజలే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సీజ్ చేసిన డబ్బును, నగలను ఎట్లా విడిపించుకోవాలో తెల్వక పోలీసులు, ఎమ్మార్వో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి క్యూ కట్టి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. నేతల డబ్బుల మూటలు ఎక్కడివక్కడ చేరిపోతుంటే.. వాటిని పక్కన పెట్టి తమపై పడుతున్నారేంటని పోలీసులపై మండిపడుతున్నారు.

రోజుకింత పట్టుకోవాలని టార్గెట్!

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ దాకా రాష్ట్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా పోలీస్, ఐటీ, జీఎస్టీ, ఇతర ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలను తీవ్ర స్థాయిలో మందలించింది. డబ్బు తరలిపోతుంటే నిద్రపోతున్నారా? అంటూ సీరియస్ అయింది. వెంటనే తనిఖీలు మొదలుపెట్టాలని ఆదేశించింది. దీంతో ఎలక్షన్ షెడ్యూల్ రాక ముందే.. ఈ నెల 6వ తేదీ నుంచే చెకింగ్ పాయింట్స్ పెట్టారు. ఇక 9న షెడ్యూల్ ప్రకటించడంతో మరిన్ని పాయింట్లు పెట్టి తనిఖీలు ముమ్మరం చేశారు. పైగా వారందరికీ రోజుకింత పట్టుకోవాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి టార్గెట్ కూడా పెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 9వ తేదీ నుంచి అన్ని రకాల చెక్​ పాయింట్లు, తనిఖీల నుంచి నగదు, బంగారం, మద్యం, వస్తు సామగ్రి, ఇతరత్రా అన్నింటి విలువ కలిపి దాదాపు రూ.109 కోట్లు సీజ్ చేశారు. ఇందులో 70 శాతం సామాన్యులు వివిధ అవసరాల కోసం తరలిస్తున్న నగదు, బంగారం ఉన్నట్లు ఆఫీసర్లే చెబుతున్నారు. సామాన్యుల నుంచి విజ్ఞప్తులు పెరుగుతుండటంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని తర్జనభర్జన పడుతున్నారు.

రశీదులు ఎక్కడి నుంచి తేవాలి

లీడర్ల సొమ్ము, ఐటీ లెక్కల్లో లేని నగదు చేరాల్సిన చోట్లకు చేరుతుంటే వాటిని వదిలేసి తమ మీద పడుతున్నారేంటని చిరు వ్యాపారులు, సామాన్య జనాలు పోలీసులపై మండిపడుతున్నారు. దాచుకున్న సొమ్మును హాస్పిటల్ అవసరాలకో, పెళ్లిళ్లకో, భూమి జాగ అమ్మడానికో, కొనుగోలు చేయడానికో, ఇండ్లు కట్టుకునేందుకో బయటికి తీసుకొస్తే.. తాము ఏం చెప్పినా వినకుండా స్వాధీనం చేసుకుంటున్నారని వాపోతున్నారు. వాటికి రశీదులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని, అప్పోసొప్పో చేసి తీసుకువచ్చే డబ్బును కూడా ఓటర్ల ప్రలోభం కోసమని భావించి సీజ్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. తమ పరిస్థితిని కనీసం అర్థం చేసుకోరా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ రుజువులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. 

ఎన్నికలయ్యేదాకా ఆగాల్నట

ఎలక్షన్ కోడ్ ప్రకారం.. ఎవరినైనా ఎక్కడైనా, ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం రాష్ట్ర, కేంద్ర పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ, ఎన్నికల సిబ్బందికి ఉంది. ఎన్నికల సంఘానికి కోడ్ సమయంలో విస్తృత అధికారాలు ఉంటాయి. నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, గిఫ్టులు, ఖరీదైన వస్తువులు వంటి వాటిని తీసుకెళ్లేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలను చూపించాల్సిందే. లేదంటే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. రూ.50 వేలకు మించి పట్టుబడితే రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తున్నారు. వాటికి ఒకటి, రెండు రోజుల్లో ఆధారాలు తీసుకువచ్చి చూపించినా వినడం లేదు. ఒకవేళ భారీ స్థాయిలో నగదు పట్టుబడితే సదరు వ్యక్తిపై కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేస్తున్నారు. ఇన్​కమ్ టాక్స్ అధికారుల దర్యాప్తునూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో సొమ్ము విడిపించుకోవాలంటే ఎలక్షన్లు అయ్యే దాకా ఆగాల్సిందేనని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు సీజ్ చేసిన సొమ్మును విడిపించుకునేందుకు ఏం చేయాలో తెలియక సామాన్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులను వేడుకోవడంతో పాటు స్థానిక ఎమ్మార్వో (రిటర్నింగ్ ఆఫీసర్)ను కలిసి ఆధారాలు ఇస్తూ వస్తున్నారు. అక్కడా స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌‌‌‌ను వేడుకుంటున్నారు. పై నుంచి ఆదేశాలు లేవని తామేమీ చేయలేమని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. చివరి ప్రయత్నంగా సీఈఓ కార్యాలయానికి వచ్చి.. తమ సొమ్ము అక్రమం కాదని, త్వరగా విడిపించి ఇవ్వాలని వినతిపత్రాలు ఇచ్చి వెళ్తున్నారు.

ఇట్లయితే వైన్స్ బంద్ చేసుకుంటం

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇబ్బంది అవుతున్నదని వైన్స్ షాపుల ఓనర్లు చెబుతున్నారు. 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు 56 వైన్ షాపులకు సంబంధించిన డబ్బులు సీజ్ చేశారని.. వ్యాపారం కూడా చేసుకోద్దా అని మండిపడుతున్నారు. సోమవారం బీఆర్కే భవన్​లో సీఈఓ వికాస్ రాజ్‌‌కు 50 మందికి పైగా వైన్స్ షాపుల ఓనర్లు ఫిర్యాదు చేశారు. రూ.కోట్లు  పెట్టి వ్యాపారం చేసే వాళ్లను పోలీసులు దొంగల్లాగా చూస్తున్నారని వాపోయారు. మఫ్టీలో వచ్చి పోలీసులు షాపుల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. సీఈఓను అడిగితే కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్‌‌‌‌లకు ఆదేశాలిస్తామని చెప్పారని వారు వెల్లడించారు. నౌకరి నామ, షాప్ లైసెన్స్ చూపించినా వదలకుండా పోలీసులు రూడ్‌‌గా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇలానే ఇబ్బంది పెడితే రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపులను క్లోజ్ చేస్తామని, తర్వాత ప్రభుత్వం, అధికారుల ఇష్టమని హెచ్చరించారు.

రూ.4 లక్షలు సీజ్ చేశారు

మేడ్చల్‌‌లో ఉన్న లక్ష్మీ వైన్స్‌‌ ఓనర్‌‌‌‌.. రాత్రి 11 గంటలకు షాపు మూసేసి.. డబ్బు కౌంట్ చేసుకుని ఇంటికి బయల్దేరాడు. హాఫ్ కిలో మీటరు కూడా వెళ్లకుండానే పోలీసులు అడ్డుకుని, నగదును సీజ్ చేశారు. లిక్కర్​ అమ్మకాలతో వచ్చిందని ఆధారాలు చూపించినా పట్టించుకోలేదని సదరు ఓనర్ వాపోయాడు. ఒకరోజు కౌంటర్​ రూ.4 లక్షలు అయిందని, ఆ మొత్తం సీజ్ చేశారని చెప్పాడు. పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో, కలెక్టర్, సీఈఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నాడు.

ఇంటి పనికి సిమెంట్ కొందామని వెళ్తుంటే..

జనగామ జిల్లాలో వంగ రాజు అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇంటికి అవసరమైన స్టీల్, సిమెంట్ కొనేందుకు తాను దాచుకున్న రూ.2 లక్షలు తీసుకుని బయలుదేరాడు. షాపునకు వెళ్తుండగా.. చెక్ పోస్టులో పోలీసులు ఆపారు. రూ.2 లక్షలకు ఆధారాలు చూపమని చెప్పారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ కోసం డబ్బు తీసుకెళ్తున్నానని, దాచుకున్న డబ్బుకు ఆధారం ఏముంటుందని చెప్పినా పోలీసులు వినలేదని రాజు వాపోయాడు. నగదును స్వాధీనం చేసుకున్నారని, ఇంటి నిర్మాణ పనులు ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు.

పండుగకు నగలు తీసుకెళ్తుంటే..

దసరా సెలవులు రావడంతో మంచిర్యాలకు బయల్దేరింది సుగుణ. ఇంట్లో పెడితే దొంగలు పడుతారేమోనని, పండుగ పూట వేసుకోవచ్చని బంగారాన్ని సూట్‌‌కేసులో పెట్టుకుంది. అయితే పెద్దపల్లి– రామగుండం మధ్యలో చెక్ చేసిన పోలీసులు.. 15 తులాల నెక్లెస్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘అది ఎప్పుడో 8 ఏండ్ల కింద చేయించుకున్నది. ఇప్పుడు కొన్నట్లు ఆధారం ఎట్లా చూపించాలి? అదీ ఇంట్లో దొంగలు పడుతారేమో అనే భయంతో తీసుకెళ్తున్నా. పండగకు వేసుకోవచ్చని అనుకున్నా. ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. నెక్లెస్ సీజ్ చేశారు” అని ఆమె వాపోయింది.

సోమవారం సీజ్ చేసిన నగదు వివరాలివీ

కరీంనగర్‌‌‌‌లో రూ.2.36 కోట్లు

కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్‌‌‌‌లోని సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద టూ టౌన్ ఇన్‌‌స్పెక్టర్ రాంచందర్ రావు వాహన తనిఖీలు చేపట్టారు. ఏటీఎంలకు డబ్బులు సరఫరా చేసే ‘రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్’ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో రూ.2.36 కోట్ల నగదు ఉండడం, ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులకు సంబంధించిన రోజువారీ కలెక్షన్‌‌ను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వెహికిల్ డ్రైవర్ చెప్పాడని, అనుమానం వచ్చి నగదును సీజ్ చేశామని వెల్లడించారు.

కాగజ్​నగర్‌‌‌‌లో రూ.99 లక్షలు సీజ్

కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌‌‌‌లో రూరల్ సీఐ నాగరాజు అధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కారులో తీసుకెళ్తున్న రూ.99 లక్షలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. నగదు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా గుర్తించారు.

టోల్ ప్లాజా వద్ద రూ.51 లక్షలు

జైనథ్, వెలుగు : ఆదిలాబాద్​జిల్లా జైనథ్ మండలంలోని పిప్పర్ వాడ టోల్ ప్లాజా చెక్​పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న రూ.51 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఓ కారును తనిఖీ చేయగా డబ్బు దొరికిందని ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్ఐ నారాయణ తెలిపారు. ఆధారాలు లేకపోవడంతో నగదు సీజ్​చేశామని.. డ్రైవర్ ఆక్సిమ్ మునీంద్ర చించుల్కర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

కూకట్‌‌పల్లిలో ఆటోలో రూ.26.25 లక్షలు

కూకట్​పల్లి, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న రూ.26.25 లక్షల నగదుని సోమవారం సాయంత్రం కేపీహెచ్​బీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక రమ్య గ్రౌండ్స్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. రాజస్థాన్​కు చెందిన రామకిషన్, సిద్దిపేటకు చెందిన ఎం.సతీష్​ఆటోలో వెళ్తుండగా ఆపారు. చెక్ చేయగా.. రూ. 26.25 లక్షల నగదు కనిపించింది. సంబంధిత  డాక్యుమెంట్స్  లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. 

రంగారెడ్డి జిల్లాలో 53 తులాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం సాయంత్రం శేరిగూడ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, వేర్వేరు కార్లలో 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, కారణాలు చెప్పకుండా మంచాల మండలం ఆరుట్లకు చెందిన మద్దెల ఉదయ్ కుమార్, ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్ నగర్ కు చెందిన ఆలూరి సంతోష్ కుమార్ తీసుకెళ్తున్న 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
 
మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌‌లోని పైప్‌‌లైన్ రోడ్డులో పోలీసులు వాహనాలను చెక్‌‌ చేస్తుండగా.. 16 కేజీల బంగారం, 23 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నరు.

 హైదరాబాద్‌‌ మాదాపూర్ లో 32 లక్షలు, గచ్చిబౌలిలో రూ.10 లక్షలు స్వాధీనం. వనస్థలిపురంలో తనిఖీలు చేయగా.. ఇద్దరి నుంచి రూ.29 లక్షలు పట్టుబడింది.
 
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.4.95 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.

 నార్సింగి పరిధి మంచిరేవుల క్రాస్ రోడ్ వద్ద రూ.17 లక్షలు, నార్సింగిలోని యూనియన్ బ్యాంక్ ఏరియాలో రూ.15 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సేవింగ్స్ అని చెప్పినా వినలే

రంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ తనకున్న 300 గజాల స్థలాన్ని అమ్మేందుకు నెల కిందట ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందే కొంత అడ్వాన్స్ తీసుకోగా.. 13వ తేదీన రిజిస్ర్టేషన్ పెట్టుకున్నారు. భాస్కర్ స్థలాన్ని కొనుగోలు చేసిన రాజేందర్.. మిగిలిన సొమ్ము తీసుకుని రిజిస్ర్టేషన్ ఆఫీస్‌‌కు బయల్దేరగా మార్గమధ్యలో పోలీసులు చెక్ పాయింట్‌‌లో తనిఖీలు చేశారు. రూ.6 లక్షల నగదు ఆయన వద్ద ఉండటంతో సీజ్ చేశారు. పైగా ఐటీకి రిఫర్ చేశారు. అది తన సేవింగ్స్ సొమ్ము అని, అప్పుడప్పుడు బ్యాంకులో నుంచి డ్రా చేసుకున్నానని, ఈ మేరకు పాత స్లిప్పులు చూపించినా పోలీసులు వదల్లేదని ఆయన వాపోయారు. పై అధికారుల వద్దే తేల్చుకోవాలని పోలీసులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.