
జూబ్లీహిల్స్ బాలికపై అఘాయిత్యం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ్టి నుంచి కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లను జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను మూడో రోజు అధికారులు విచారించనున్నారు. ప్రధాన నిందితుడు, మైనర్లను కలిపి, విడివిడిగా ప్రశ్నించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది. అనంతరం మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించనున్నారు. వాస్తవానికి జువైనల్ హోం లోనే ప్రశ్నించాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితుల దృష్ట్యా జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించనున్నారు. విచారణలో భాగంగా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.
ఇదిలా ఉంటే కేసులో ప్రధాన నిందితుడైన సాబుద్దీన్.. తొలుత పోలీసుల ఏ ప్రశ్న అడిగినా తనకు సమాధానం తెలియదని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారులు కాల్ డేటా, కాల్ లొకేషన్, సీసీ పుటేజ్ ను నిందితుడి ముందుంచి ప్రశ్నించగా.. నేరం ఎలా చేసింది వెల్లడిస్తున్నట్లు సమాచారం. బాలికపై అఘాయిత్యం చేయాలని పబ్లోనే ప్లాన్ చేశామని, నిందితుల్లో ఒక మైనర్ ఘటనకు సూత్రధారి అని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం తమపై కంప్లైంట్ చేస్తే వీడియోలను సర్కులేట్ చేస్తామని బాధితురాలిని నిందితులు భయపెట్టినట్లు సాదుద్దీన్ వెల్లడించాడు. కేసు బుక్ కాగానే భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయినట్లు చెప్పినట్లు సమాచారం.
మరోవైపు నిందితుడు పోలీసు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అతని స్టేట్మెంట్ను దర్యాప్తు రిపోర్టుతో సరిచూసుకుంటున్నారు. కేసు నమోదైన వెంటనే నిందితులు హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ఎవరు సహకరించారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటి వరకు సాదుద్దీన్ వెల్లడించిన వివరాల ఆధారంగా మైనర్లను ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.