
సికింద్రాబాద్ స్టేషన్లో శుక్రవారం జరిగిన విధ్వంసానికి కీలక సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ ఓనర్ ఆవుల సుబ్బారావును ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. నిరసనల వెనుక సుబ్బారావు హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి హింసను ప్రేరేపించినట్లు విచారణలో తేలింది.
ఏపీ, తెలంగాణల్లో 9 డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న ఆవుల సుబ్బారావు గురువారం రాత్రే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ అల్లర్లలో మొత్తం 10 డిఫెన్స్ అకాడమీల్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు పాల్గొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్ట్ చేశారు. నరసారావు పేట నుంచి వచ్చిన అభ్యర్థులే తొలుత దాడికి దిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనలో ఎక్కువ మంది సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులే ఉన్నారని, గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నుంచి కూడా ఆందోళనకారులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ట్రెయిన్ లో సాయి అకాడమీకి చెందిన 450 మంది వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.