ఎమ్మెల్యేపై పోస్ట్​ పెట్టిండని యువకుడిపై థర్డ్​ డిగ్రీ

ఎమ్మెల్యేపై పోస్ట్​ పెట్టిండని యువకుడిపై థర్డ్​ డిగ్రీ
  • లాఠీలతో కొట్టడంతో నడవలేని స్థితిలో బాధితుడు
  • ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని  పోలీస్​ కమిషనర్​కు కంప్లయింట్​ 

కరీంనగర్, వెలుగు:  ఎమ్మెల్యే, టీఆర్​ఎస్ నాయకులను కించపరిచేలా సోషల్​ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే కారణంతో ఓ యువకుడిపై పోలీసులు థర్డ్​డిగ్రీ ప్రయోగించారు. స్టేషన్​కు పిలిపించి, లాఠీలతో కొట్టడంతో వీపు, అరికాళ్లు కమిలిపోయాయి. కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో ఇటీవల యాదవులు బీరప్ప ఉత్సవాలను వేర్వేరుగా జరుపుకున్నారు. గత వారం ఒక గ్రూపు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టీఆర్ఎస్ లీడర్లను ఆహ్వానించినప్పటికీ రాలేదు. ఈ వారం రెండో వర్గం జరుపుకున్న బీరప్ప ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు ​మండల ప్రజాప్రతినిధులు, లీడర్లు హాజరయ్యారు. మొక్కులు చెల్లించాక భోజనం కూడా చేశారు. దీంతో మొదటి గ్రూపులో ఉన్న టీఆర్ఎస్ పార్టీ  గ్రామ శాఖ అధ్యక్షుడు తొంటి పవన్​కుమార్ ​కోపంతో ఎమ్మెల్యే, ఇతర లీడర్లు భోజనం చేస్తున్న ఫొటోకు అభ్యంతకర కామెంట్ ​పెట్టి వాట్సాప్​ గ్రూప్​లో  పోస్ట్​ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలీసులకు కంప్లయింట్​ చేశాడు. దీంతో తనను స్టేషన్​కు పిలిపించిన పోలీసులు థర్డ్​ డిగ్రీ ప్రయోగించారని,  ఎస్సై సామల రాజేశ్ ​లాఠీతో అరికాళ్లపై, వీపుపై కొట్టారని పవన్​ అంటున్నాడు. తనపై శుక్రవారం సాయంత్రం దాకా ఎలాంటి కంప్లయింట్​ రాలేదని, కానీ  ఎమ్మెల్యే మెప్పు కోసం గురువారం ఉదయమే పోలీసులు స్టేషన్​కు తీసుకువచ్చి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నారని ఆరోపించాడు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి  కరీంనగర్​ సీపీకి కంప్లయింట్​ చేశాడు. ఎస్​ఐ, పోలీసుల దెబ్బలకు తాను లేచి నడవలేని స్థితికి చేరుకున్నానని కన్నీటిపర్యంతమయ్యాడు.  కాగా, ఈ ఘటనపై  కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్​రావుతో విచారణ జరిపించి, ఎస్​ఐది తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ తెలిపారు.