
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై నమోదైన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. అమిత్ షా, కిషన్ రెడ్డి పేర్లను చార్జ్‌షీట్ నుంచి తొలగిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. కేసులో ఫిర్యాదు దారుడైన పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్‌కు శనివారం నోటీసులు అందించారు. ఈ నెల 10న నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుకావాలని సూచించారు. మే 1న పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా
మొగల్‌పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆ సమయంలో సభా వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు. అమిత్ షా ఆ చిన్నారులను పిలవడంతో వారిద్దరూ ఆయన వద్దకు వెళ్లారు. వారిలో ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై బీజేపీ కమలం పువ్వు గుర్తు ఉంది. మరో చిన్నారి చేతిలో ఆప్ కీ బార్ అనే ప్లకార్డ్స్ ఉన్నాయి. ఈ ఘటనపై మొఘల్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కోడ్ ఉల్లంఘించారంటూ కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డిని నిందితులుగా చేర్చారు. దర్యాప్తు అనంతరం ఎలక్షన్ కోడ్ వర్తించదని గుర్తించారు. వారిద్దరి పేర్లను తొలగిస్తూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.