అనర్థ పాలన ఓడినా.. అహంకారం అట్లనే ఉంది!

అనర్థ పాలన ఓడినా.. అహంకారం అట్లనే ఉంది!

అనర్థం ఓడింది. కానీ అది కనుమరుగు కాలె. ప్రతిపక్షరూపంలో బతికే ఉంది.  అందుకే యుద్ధం ఇంకా మిగిలేవుంది. పవర్​ పోయినా ప్రతాపం పోలె. అహంకారం అంతకన్నా పోలె. అసహనం పెరిగింది. ఓడిన వెంటనే శాపనార్థాలు, 420 హామీలంటూ సంస్కారం మరిచింది. ప్రజలు కన్​ఫ్యూజ్​ అయి తమను ఓడించారంటున్నది. 2014లో, 18లో ఏమాత్రం కన్ఫ్యూజ్​ కాలేదట! ఇప్పుడు మాత్రమే కన్ఫ్యూజ్​ అయ్యారంటున్నది. యూట్యూబ్​ చానెళ్లు, సోషల్​ మీడియా ఫేక్​ ప్రచారమే తమను ఓడించింది అంటున్నారు. కేసీఆర్​ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకు చింతిస్తున్నారని యువనేత రోజువారి విశ్లేషణ! ప్రజలను పరోక్షంగా నిందించే వ్యవహారాన్ని తలకెత్తుకున్నారు. 

చివరకు అనవలసినవన్నీ అన్నాక.. చివరలో ‘మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ మాటలు మేము అనం’- అనే మాట తాజా మాజీ ‘ముఖ్య’ మైన మంత్రి పేటెంట్​ డైలాగ్​ అని అందరికీ తెలుసు! నోరుంది. మాటను తిరిగేసి చెప్పే తెలివుంది. ఇంకేం, ఏదైనా చెప్పగలడు! తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా కథలల్లి చెప్పే నేర్పరి! మాటల విద్యల్లో ఆరితేరారు. ప్రజల తీర్పునే తప్పు పట్టే ఘనుడు! పరోక్షంగా ప్రజలపైనే విరామం లేని అసహనాన్ని  చాటుకుంటూ వస్తున్నారు.

రాజకీయ మర్యాదకే దిక్కులేదు

కనీస రాజకీయ మర్యాద అయినా పాటించిన పాపాన పోయారా?  కొత్త ముఖ్యమంత్రికి, పాత ముఖ్యమంత్రి అభినందనలు చెప్పిన దాఖలా ఉందా! అసహనం పెంచుకున్నారు. సంప్రదాయాన్ని, సంస్కారాన్ని మర్చిపోయారు! ఇంతటి విపరీత అసహనం ఓడించిన ప్రజలపైనే అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటది?  భారత రాజకీయాల్లో  ప్రజలనే తప్పు పట్టే రాజకీయపార్టీని ఎక్కడా చూసి ఉండమేమో!

‘ఫక్తు’ తో  మొదలైన పాలన..

తెలంగాణ వచ్చిన మరుసటి రోజే ఇకపై మాది ఉద్యమ  పార్టీకాదు, ఫక్తు రాజకీయ పార్టీయే, ఫక్తు రాజకీయమే చేస్తాం అని  ఒకే ఒక్క మాటచెప్పి.. తొమ్మిదన్నరేండ్ల  విధ్వంస పాలనకు సర్టిఫికెట్​ పొందామని అనుకున్నారు. ‘అశ్వత్థామ హత:కుంజర:’ అన్నట్లు ప్రజలకు అర్థం కాని ఫక్తు రాజకీయం పేర  విధ్వంస పాలన మొదలుపెట్టారు. కానీ ఫక్తు రాజకీయం అనేది ప్రజలకు అర్థం అయ్యేందుకు తొమ్మిదిన్నరేండ్లు పట్టింది. అర్థమయ్యాక ప్రజలు అనర్థాన్ని, విధ్వంసాన్ని ఓడించారు. ఈ లోపల కాళేశ్వరం వంటి  నిరర్థక అభివృద్ధులను శాశ్వతంగా తెలంగాణకు గుదిబండలుగా మార్చేసిపోయారు.

భిన్నపాలన, సొంతపాలనైంది

ఒకవైపు తమది ఫక్తు రాజకీయం అంటూనే, మరోవైపు  మళ్లీ తమది ఉద్యమపార్టీయే అన్నట్లు.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాననే డైలాగును ప్రజల చెవుల్లో జొర్రీగలాగ నిరంతరం వినిపించారు. చావునోట్లో తల పెట్టినోడు, తెలంగాణే ఒక కులంగా, ఒక మతంగా ప్రజాదరణ పొందాలి. కానీ కులాలకు, మతాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టి ఓటుబ్యాంకులుగా మార్చుకోవాలనుకున్నారు! మిగతా ప్రొఫెషనల్​ పార్టీలన్నీ ఫక్తు రాజకీయ పార్టీలే. అనుమానం లేదు. కానీ చావునోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ, మిగతా పార్టీలకన్నా భిన్నంగా పనిచేస్తదని ప్రజలు ఆశించారు. కానీ భిన్నంగా కాదు సరికదా, మిగతా పార్టీలను మించిన ఫక్తు రాజకీయంతో తొమ్మిదిన్నరేండ్లు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుల పక్షపాతం, కుటుంబ పాలనలతో తామే శాశ్వత పాలకులమని తమకు తాము విశ్వసించుకున్నారు. దాంతో తెలంగాణ కావలసినంత విధ్వంసమైంది. చట్టాలను చుట్టాలుగా మార్చుకున్నారు. సమాజంలోని అన్ని వ్యవస్థలను చెరపట్టారు. ఢిల్లీ టూ గల్లీ అంత తమ చెప్పుచేతల్లోకి  తెచ్చుకున్న పరిస్థితి తాండవించింది. శాశ్వత పాలనకు బలమైన దారులు వేసుకున్నామని అనుకున్నారు!

 ఓటు క్షేమం

సంక్షేమం పేర పెండ్లిళ్ల పథకాలు నడిపి మేనమామ అనిపించుకొని ఓటు వేయించుకోమరిగారు. కానీ  ఫీజురియింబర్స్​మెంటుకు ఎగనామం పెట్టి మేనకోడండ్లు, మేనల్లుళ్ల ప్రభుత్వ చదువుకు పంగనామాలు పెట్టారు. పింఛన్లిచ్చి ముసలామెతో పెద్ద కొడుకు అనిపించుకొని ఓటు వేయించుకో మరిగారు తప్ప, చిన్న తమ్ముండ్లు బెల్ట్​షాప్​లకు కష్టాన్ని తగులబెట్టారని ఎన్నడూ అనలేదు.  ఇలాంటి సంక్షేమంతో  ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు ఉన్నాయా? ఓటేసే నగదు పథకాలతో రాజ్యమేలారు. ఆరోగ్యశ్రీ నత్తనడకతో పేదోని ఆరోగ్యం గాలిలో దీపమైంది.  ఓట్ల పండుగ రాగానే ముసలోళ్లకు కారు గుర్తు మంచిగ కనపడాలని ఐదేండ్లకోసారి కండ్లద్దాల ‘కంటి వెలుగు’ మాత్రం టెన్షన్​గా నడిపారు. ఏ పథకమైనా తమ ఓటు కోసం తప్ప, ప్రజలు ఎదిగేందుకు కాదనే నీతి అడుగడుగునా నాట్యమాడింది.

అనర్థం చేసిపెట్టిన వ్యక్తిస్వామ్యం 

వ్యక్తిస్వామ్యం నిర్మించుకున్నారు. వ్యవస్థలను గౌరవించడం మానేశారు. రాష్ట్రానికి వచ్చిన దేశ ప్రధాన మంత్రినే కలువకుండా అనేకమార్లు అవమానించారు. గవర్నర్​కూ అదే అవమానం. తన హైహ్యాండెడ్​ నెస్​ కోసం కేంద్రంతో సంబంధాలనే దెబ్బతీశారు. తెలంగాణకు తీరని నష్టం చేసిపెట్టారు. సంపన్న రాష్ట్రమంటూ అనేక కేంద్ర పథకాలను కాదన్నారు. ఆయుష్మాన్​ భారత్​ మాకెందుకు అద్భుతమైన ఆరోగ్యశ్రీ ఉండగా అంటూ ఊదరగొట్టారు. తీరా ఆరోగ్యశ్రీ బకాయిలు పెరగడంతో ఆయుష్మాన్​ భారత్​ను​  మూడేండ్ల తర్వాత కలిపేసుకున్నారు. షేరింగ్​ ఫండ్​ ఇవ్వక అనేక కేంద్ర పథకాలను తిరుగు ముఖం పట్టించారు. సంపన్న రాష్ట్రమంటూ, తమ పబ్లిసిటీ ఆరాటం కోసం తెలంగాణకు తీరని నష్టం చేసిపెట్టారు.

 సృష్టించిన ఆస్తులు నిరర్థక ఆస్తులయ్యాయి

 రియల్టర్లు, కాంట్రాక్టర్లు, సంపన్నుల సంపదలను పెంచి తెలంగాణ ప్రజలందరి తలసరి ఆదాయం పెరిగిందంటూ ఊదరగొట్టారు . ఎస్​జీడీపీ పెరిగిందన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయినా.. దేశంలో మనమే నంబర్​ వన్​ అనే ప్రచారం మాత్రం మానుకోలేదు. ఖజానా ఊడ్చేశారు. అప్పులు రూ. 6.71 లక్షల కోట్లు చేసిపెట్టారు. ‘తాను నచ్చిందే రంభ’ అని ప్రజల ఆకాంక్షలను గాలికి వదిలేసి, తన ఆకాంక్షలు నెరవేర్చుకున్నారు. ఫలితంగా కాళేశ్వరం నుంచి మొదలుకుంటే  భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్ల దాకా  నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. ఫక్తు పాలన సృష్టించిన సంపద అంతా.. మేత మేసే తెల్ల ఏనుగులుగా మారిపోయాయి తప్ప మేత పెట్టే కామధేనువులు కాలేకపోయాయి. తాజా మాజీ ‘ముఖ్య’మైన మంత్రి  సృష్టించిన సంపద ఇంకేమున్నదో  మనకైతే తెలియదు!

యుద్ధం మిగిలే ఉంది

అహాన్ని, అసహనాన్ని రాజకీయంగా మట్టు పెట్టకపోతే  తెలంగాణకు మరింత అనర్థం పొంచి ఉన్నట్లే! కాంగ్రెస్​, బీజేపీల ఢిల్లీ రాజకీయ వైరుధ్యాన్ని   బీఆర్​ఎస్​ సొమ్ము చేసుకొని పునరుజ్జీవం పొందాలని తప్పక చూస్తుంది. ‘చింత చచ్చినా పులుపు చావదు’ . కాబట్టి ‘అహంకారం’ మళ్లీ రాజకీయ పునరుజ్జీవం పొందితే.. అది తెలంగాణకు తీరని అనర్థమే. అదంతా బీఆర్​ఎస్​ పట్ల కాంగ్రెస్​, బీజేపీలు వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటది. కాబట్టి, బీఆర్​ఎస్​ పై ఇంతకాలం చేసిన అవినీతి ఆరోపణలపై నిలబడి వెలికి తీయకపోతే బాధ్యులు కాంగ్రెస్​, బీజేపీలే అవుతాయి. అందుకే యుద్ధం మిగిలే ఉంది. ఆ రెండు జాతీయ పార్టీలు  అవినీతిపై యుద్ధం చేయనపుడు, తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పుట్టే అవకాశాన్ని ఎవరూ కొట్టేయలేరు.  ఆ విషయాన్ని కాంగ్రెస్​, బీజేపీలు గుర్తించగలిగితే తెలంగాణలో ఆ పార్టీల భవిష్యత్తుకే మంచిది.

అసహనానికి ఆత్మపరిశీలన పట్టదా?

ఓటమి పాలయి నెల దాటింది. ఆ పార్టీలో ఇంతవరకు  ఓటమిపై సమీక్ష  జరిగిందా? ఆత్మపరిశీలన చేసుకుంటామనే మాట ఆ పార్టీ  నోట ఇప్పటికైనా విన్నామా? ‘తప్పు ప్రజలది అయితే, మేమెందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలే?’ అని ప్రజలనే తిరిగి ప్రశ్నిస్తారేమో తెలియదు!  ఇంత కాలం  వారు ప్రజలను ఓడించారు. ఇపుడు ప్రజలే  వారిని ఓడించారు. అందుకేనేమో భరించలేకపోతున్నారు! అహంకారాన్ని దాచుకోలేని పరిస్థితి, కడుపులో ఉన్న అసహనాన్ని ఓడించిన ప్రజల మీద కాదన్నట్లు నటిస్తూ  సోషల్​ మీడియా, యూట్యూబ్​ చానళ్లపై వెళ్లగక్కుతున్నారు! తొమ్మిదేండ్లు 90 శాతం మీడియా సంస్థలు, యూట్యూబ్​ చానళ్లు వారికే వంత పాడాయి.  అలాంటపుడు ఫేక్​ ప్రచారం చేయడంలోనూ బీఆర్​ఎస్​ తర్వాతే మరెవరైనా కదా! మిగిలిన పది శాతం మీడియా సంస్థలు, యూట్యూబ్​ చానళ్లే  బీఆర్​ఎస్​ను ఓడించగలిగాయంటే.. వాటికి నిజంగా హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే మరి!  వాస్తవానికి వారి అసహనమంతా ఓడించిన ప్రజల మీదనే!

అవినీతిని ఉపేక్షిస్తే తెలంగాణకే అనర్థం

ఏకస్వామ్యంతో జరిగిన విధ్వంసం, అవినీతి, అనర్థ పాలనను ఓడించిన ప్రజలనే నిందిస్తున్నది అహంకారం! ఉన్న అర్థ బలంతో, బ్లేమ్​గేమ్​తో తిరిగి గెలవచ్చని అది భావిస్తున్నది.​ ప్రజాతీర్పును ప్రపంచంలో గౌరవించే వారుంటారు, కానీ నిందించేవారుండరు. కానీ, తెలంగాణలో నిందించేవారు ఉన్నారంటే, అది తెలంగాణకే ప్రమాదకరం. అందుకే యుద్ధం మిగిలే ఉంది! అహంకారం, అసహనంపై యుద్ధం చేయాల్సింది అటు కేంద్రంలో , ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలే. తొమ్మిదన్నరేండ్ల పాలనలో జరిగిన అవినీతిపై యుద్ధం చేయాలి. అహంకారానికి ఉన్న ఆర్థిక మూలాలను ఛేదించాలి.  నిరర్థక ఆస్తులుగా మారిన కాళేశ్వరం, భద్రాద్రి, యాదాద్రి వంటి అనేక వాటిపై నిక్కచ్చి దర్యాప్తు జరగాలి. ధరణిలో లక్షల భూముల గోల్​మాల్,​  జరిగిన అవకతవకలూ బయటికి రావాలి.

-కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి,పొలిటికల్​ ఎనలిస్ట్​