మహిళా రిజర్వేషన్ బిల్లు: ఆమె ప్రాతినిధ్యం జాతికి, దేశానికి మేలు

మహిళా రిజర్వేషన్ బిల్లు: ఆమె ప్రాతినిధ్యం జాతికి, దేశానికి మేలు

రాజ్యాంగ (131వ)  సవరణ బిల్లును అడ్డుకొని  మహిళలకు  ద్రోహం చేశారని  ఒకరు,  ‘కాదు ఆ బిల్లును పునర్విభజనతో  జతచేసి  కావాలనే  మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా  అడ్డువేశారు’  అని  మరొకరు... ఇలా పరస్పర విమర్శల పర్వం ముగిసింది.  రాజకీయ పదఘటనల్లో  నింగికెగిసిన ధూళి  నెమ్మదిగా  నేలకు జారింది. క్రమంగా ఇప్పుడు చిత్రం స్పష్టమౌతోంది.  ఎవరు ఎవరిమీద  పైచేయి  సాధించారన్న రాజకీయ చర్చను కాసేపు పక్కనపెడితే, నికరంగా  ఓడిపోయింది  మాత్రం  ఈ  దేశపు  సగటు మహిళ!  

దశాబ్దాల  అన్యాయం  కొనసాగుతూనే ఉంది.  పురుషాధిక్య  వ్యవస్థలో  లింగ వివక్ష,  ఆడవారికి  జరుగుతున్న అన్యాయానిది శతాబ్దాల చరిత్రే.  దేశానికి స్వాతంత్య్రం  లభించి  దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా వారికి తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం ఏ లెక్కల్లో చూసినా దుర్నీతి,  దురన్యాయమే! దాన్ని సరిదిద్దే ఎన్నో అవకాశాలను మన పాలకులు ఎప్పటికప్పుడు జారవిడుస్తూనే  ఉన్నారు.  చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఒక చట్టం తెచ్చుకొని, దాని అమలుకు ‘గెజెట్‌‌‌‌’ ప్రకటించి, ఆచరణను మాత్రం మళ్లీ వాయిదా వేసుకున్నాం.  ఇక  ఇంకెప్పుడు?  ఇదిప్పుడు  భారత  సమాజం  ముందున్న ప్రశ్న.

సగం జనాభాగా ఉన్న మహిళల స్వరం చట్టసభల్లో వినిపించకపోవడం వారికి మాత్రమే నష్టం కాదు.  దేశ అత్యున్నత విధాన నిర్ణాయక సభల్లో మహిళకు తగినంత ప్రాతినిధ్యం లభించకపోవడం వల్ల వారికన్నా ఎక్కువ నష్టపోయింది, పోతున్నది, ఈ దేశమే!  వారి  ఆలోచనల‌‌‌‌ సారం,  మేధో వికాసం, వాత్సల్యపు  హృదయ  స్పందనల మేళ్లు దేశానికి అందటం లేదు.   అవకాశాలివ్వకపోవడమే కాకుండా అడ్డుకోవడం ఘోరం. రిజర్వేషన్లు సాకారం చేయడానికి  పాలకుల్లో  చిత్తశుద్ధి,   ప్రభుత్వాలలో  నిబద్ధత  అవసరం,   అవే  లోపిస్తున్నాయి.  నోటి మాటకు, మాట వరసకే  మహిళా సాధికారత కానీ, జరుగుతున్నది  దశాబ్దాలుగా  నిర్లక్ష్యం,  ప్రత్యేకించి 1996 నుంచి ఫలితం లేకుండా  జరుగుతున్న ‘రాజకీయ తంతు’  మన  కళ్లెదుటి  నిర్వాకమే!

  • విరుద్ధ వైఖరి

మంచి పనికి ‘త్రికరణ శుద్ధి’ అవసరం అంటారు. ‘మనో వాక్కాయ కర్మణ:’  అంటే,  మనసులో,  ఆలోచనల్లో ఉన్నదే  మాటల్లో  పలకాలి,  అదే అంతిమంగా మన చర్యల్లో  ప్రతిబింబించాలి.  ఒకటికొకటి  భిన్నంగా ఉండకూడదు. కానీ,  మనం ఒకటి  చెపుతాం, అందుకు పూర్తి విరుద్ధమైనది  ఇంకోటేదో చేస్తాం.  నిజానికి మన ఆలోచన కూడా మరేదో  ఉంటుంది.  మహిళా  రిజర్వేషన్ విషయంలో అక్షరాలా ఇదే జరుగుతోంది.  రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా  రిజర్వేషన్లు  కల్పించే  విషయంలో  రాజకీయ వ్యవస్థ  ఇన్నేళ్లుగా  చేస్తున్నదదే!  ఈ ద్వైదీ భావానికి  మూలాలు  భారతీయ  సంప్రదాయ ధర్మశాస్త్రాల్లోనూ ఉండటం ఈ  దేశపు మహిళలకు శాపంగా పరిణమించింది. 

‘యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవాతా:’  అంటూ  ఎక్కడ మహిళలను గౌరవిస్తారో  అక్కడ  దేవతలు ఉంటారు అని చెప్పిన వాజ్ఞ్మయంలోనే అందుకు పూర్తి విరుద్ధ భావనలు,  వారి స్వేచ్ఛను  హరించిన  మాటలున్నాయి. ‘పితా రక్షతి  కౌమారే  భర్తా రక్షతి యౌవనే!  రక్షంతి స్థావిరే పుత్రా న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అన్నది మనుధర్మం.  అంటే,  చిన్నప్పుడు తండ్రి,  పెద్దయ్యాక భర్త,  వృద్ధాప్యంలో  పుత్రుడి  ప్రాపకంలో,  రక్షణలో ఉండాల్సిందే తప్ప జీవితంలో  ఎప్పుడూ స్త్రీకి స్వాతంత్య్ర అర్హత లేదన్న ఈ పలుకులు తరాలుగా వారి పట్ల  ములుకులయ్యాయి.

  మనుధర్మాన్ని నమ్మి,  ప్రచారం చేస్తూ ఆచరింపజూసే  రాజకీయవాదులే కాక  సామ్యవాదులమని,  రామ్‌‌‌‌మనోహర్ లోహియా రాజకీయ వారసులమని,  లోక్‌‌‌‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ శిష్యులమని ప్రకటించుకున్న పార్టీల వారు కూడా ‘మహిళా 
రిజర్వేషన్‌‌‌‌’ను  దశాబ్దాలు అడ్డుకున్న చరిత్ర మన కళ్ల ముందుంది. అదే దురదృష్టం. దేవెగౌడ ప్రధానిగా  ఉన్నప్పుడు 1996లోనే  81వ  రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలపై  ఏకాభిప్రాయం లేక  మహిళా రిజర్వేషన్  బిల్లు వీగిపోయింది.   ఆపై 1998,  1999,  2002,  2003 (వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వం), 2010 (మన్మోహన్ సింగ్ ప్రభుత్వం)లోనూ  చుక్కెదురైంది.   2023లో  ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొంది చట్టమైంది.  నిన్నటికి నిన్న (16 ఏప్రిల్), ‘అమలు మొదలైంది’ అంటూ ‘గెజెట్’ కూడా వచ్చిన తర్వాత.... రిజర్వేషన్ల కల్పనలో  ఇంకా జాప్యం ఎందుకు?

  • ఇంక జాప్యం వద్దు

నియోజకవర్గాల  పునర్విభజనకు  మహిళా  రిజర్వేషన్  అంశాన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు.   ప్రోరేటా పద్ధతిలో  50 శాతం  స్థానాల పెంపునకు  అన్ని  రాష్ట్రాలు అంగీకరిస్తే,  మూడోవంతు కొత్త సీట్లు వస్తాయి కనుక సిట్టింగ్‌‌‌‌లు  ఎవర్నీ  నొప్పించే పనిలేకుండా  మహిళా రిజర్వేషన్  అమలు తేలిక  అనుకున్నారు కాబోలు ఎన్డీయే వ్యూహకర్తలు.  కానీ,  నియోజకవర్గాల పెంపు వ్యవహారంపై  ఏకాభిప్రాయం కుదరనప్పుడు,  దానికోసం మహిళా రిజర్వేషన్  బలిపెట్టాల్సిన  అవసరమేంటి?  విడిగా  కొత్త  సవరణ  బిల్లు  ప్రతిపాదిస్తే చాలు.  దీనికి  ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు.  పునర్విభజన ప్రక్రియతో  వేర్పరచి,  ప్రస్తుతమున్న 543 లోక్‌‌‌‌సభ స్థానాల్లోనే  మూడో వంతు సీట్లను  మహిళలకు రిజర్వ్‌‌‌‌ చేయాలి.  

ఆ మేరకు,  పార్లమెంట్‌‌‌‌లో  సాధారణ  మెజారిటీతో 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని  సవరిస్తే  సరిపోతుంది.  ప్రస్తుత పంథాలోనే,  ఇదే వేగంతో మహిళా ప్రాతినిధ్యం పెరగాలంటే తరాలు మారినా  మూడోవంతు వరకైనా సాధ్యపడే సూచనల్లేవు. 2011 జనాభా లెక్కల్నిగాని, తాజాగా ఇప్పుడు మొదలైన జనగణన లెక్కలయినా  రిజర్వేషన్ వర్తింపునకు  పరిగణనలోకి తీసుకొని, 2029  ఎన్నికల్లోనే  రిజర్వేషన్ అమలు చేయొచ్చు.  ఆ తర్వాత రొటేషన్  పద్ధతిలో ఇంకో మూడో వంతు స్థానాలను  2034 ఎన్నికల్లో,  మిగిలే  మూడోవంతు స్థానాలను  2039  ఎన్నికల్లో  మహిళలకు  రిజర్వ్ చేయడం ద్వారా పదిహేనేళ్లలోనే ఒక దఫా అన్ని  స్థానాల్లోనూ  మహిళలకు అవకాశం కల్పించినట్టవుతుంది.  

మన రాజ్యాంగంలో  అధికరణం 15 నిర్దేశిస్తున్నట్టుగా  సమానత్వ సాధన దిశలో ఇదొక ముందడుగవుతుంది.  ఐక్యరాజ్యసమితి (యూఎన్)  నిర్దేశించి,  దాదాపు రెండొందల ప్రపంచ దేశాలు అంగీకారంతో  సంతకాలు చేసిన సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లోనూ (అయిదో లక్ష్యం) లింగ వివక్ష ఉండకూడదని,  అది  ఏ రూపంలో  ఉన్నా  తొలగించాల్సిందేనని  విధానపత్రం స్పష్టం చేస్తోంది.  ఏ లెక్కన చూసినా,  దేశంలో  మహిళా  రిజర్వేషన్  అమలుకు ఇదే అత్యత్తమ, ఉన్నత సమయం. 

  • మహిళా రిజర్వేషన్​ దేశ అవసరం

చాలామంది  అపోహ  పడుతున్నట్టు  చట్టసభల్లో  మహిళలకు  రిజర్వేషన్  కల్పించి,  ప్రాతినిధ్యం పెంచడం కేవలం  మహిళల అవసరం కాదు.  ఇది ఈ దేశపు అవసరం.  రిజర్వేషన్ల ద్వారా  మహిళలకు ‘సానుకూలత కల్పిస్తున్నాం’ అనుకుంటున్నారు.  కానీ,  నిజానికిది వారికి  సానుకూలత  కల్పించడం కానేకాదు,  సుదీర్ఘకాలంగా వారి పట్ల చూపిన  వివక్ష,  వారి యెడల నెలకొన్న  ప్రతికూల  పరిస్థితిని  సరిదిద్దే చర్య మాత్రమే అని గ్రహించాలి.  

పిల్లల పెంపకం-, కుటుంబ  సంక్షేమం నుంచి విద్య,  వైద్య, వ్యాపార, ఉత్పాదక, రక్షణ, అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక.. ఇలా లెక్కలేనన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించినా అద్భుతంగా రాణిస్తున్నారు.  మగవారికి ఏమాత్రం తగ్గని ప్రతిభను  కనబరుస్తున్నారు.  సంపద సృష్టిలో భాగస్వాములవుతున్నారు.  చట్టసభల్లో  స్వరం  వినిపించే  సందర్భం, విధాన నిర్ణాయక వేదికల్లో పాలుపంచుకునే  అవకాశం  కూడా  వారికి  ప్రాతినిధ్యం ద్వారా లభిస్తే,  దేశ ప్రగతి చిత్రాన్నే  మార్చగలరు. 

  • రాజకీయ వైఫల్యమా? 

మన గొప్ప సంపద అయిన మానవ వనరుల్లో మరో అర్ధభాగం,  ఇప్పుడు స్తబ్ధుగా ఉన్నది, ఇక గరిష్టంగా  వినియోగంలోకి  వస్తుంది.  అది మనకే మేలు. అవసరాన్ని గుర్తించి,  అంగీకరించి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేలేకపోవడం  కేవలం  రాజకీయ  వైఫల్యమా?  సామాజిక  విలువల పతనమా?  ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది.  2024లో  ఏర్పడ్డ లోక్‌‌‌‌సభలో మొత్తం 543 సభ్యులకుగాను 78 మంది  మహిళలు (14.7 శాతం) ఉన్నారు. 

రాజ్యసభలోని 245 మందిలో ప్రస్తుతం 31 మంది (12.6 శాతం) మాత్రమే  మహిళలు!  ఇక రాష్ట్రాల అసెంబ్లీల్లో 8–-10 శాతాలకు మించి లేరు.  ప్రపంచ సగటు 26 శాతంగా ఉంది.  ఇప్పటికే 80 దేశాల్లో  ఏదో రూపంలో మహిళా ప్రాతినిధ్యానికి రిజర్వేషన్ కల్పిస్తున్నారు.  మన దగ్గర కూడా,  స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల,  కొన్ని బాలారిష్టాలున్నా  అక్కడ వారి పాత్ర,  ప్రమేయం  పెరిగి సానుకూలత సాధించినట్టు  నివేదికలున్నాయి.  స్థానిక  పాలక మండళ్లలో  అవినీతి తగ్గి,  పౌర భాగస్వామ్యం,  ప్రభుత్వ బాధ్యత, - జవాబుదారీతనం పెరిగిన దాఖలాలున్నాయి.

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్