నాగార్జునసాగర్​లో పొలిటికల్ దావత్​లు

నాగార్జునసాగర్​లో పొలిటికల్ దావత్​లు
  • పథకాల లబ్ధిదారులతో టీఆర్ఎస్ సమ్మేళనాలు, భోజనాలు
  • మీటింగ్స్​కు రాకుంటే పథకాలు రావంటూ బెదిరింపులు
  • టీఆర్ఎస్​కు ఓటేసి కేసీఆర్ రుణం తీర్చుకోండి: ఎమ్మెల్యే కోరుకంటి చందర్

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విందు రాజకీయాలకు తెరలేపింది. అధికార పార్టీ నేతలు మండలాల వారీగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అందరినీ మీటింగ్​కు పిలిచి.. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్​కే ఓటు వేయాలని చెబుతున్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్​ ఫండ్, కేసీఆర్ కిట్, రైతుబంధు​ తదితర స్కీమ్​ల కింద లబ్ధి పొందిన వారి వివరాలను పార్టీ లీడర్లు సేకరించారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వారందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నారు. మీటింగ్ లకు రాకుంటే పింఛన్లు, స్కీమ్​లు రావని లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు తెలిసింది.
లబ్ధిదారులంతా కారుకే ఓటేయాలి: చందర్
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే, హాలియా టీఆర్ఎస్ పార్టీ ఇన్​చార్జి కోరుకంటి చందర్ సూచించారు. మంగళవారం హాలియాలో వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందిన వారితో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్​ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా గౌరవంగా బతుకుతున్న లబ్ధిదారులంతా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. టీఆర్ఎస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.